ములుగు: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ చరిత్ర, కాకతీయుల నిర్మాణ వైభవం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక పర్యాటక ప్రాధాన్యంపై వరల్డ్ హెరిటేజ్ క్యాంపులో భాగంగా మూడోరోజు ఆదివారం వలంటీర్లకు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.విజయ్ బాబు ‘తెలంగాణలో దేవాలయాలు – సాంస్కృతిక పర్యాటకం’ అంశంపై బోధించారు. తెలంగాణలోని చారిత్రక దేవాలయాల ప్రాధాన్యం, వాటి ద్వారా ప్రతిబింబించే కళలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా చరిత్ర, కళలు, సంస్కృతికి నిలువెత్తు సాక్షాలని తెలిపారు. అనంతరం చరిత్రకారుడు, హైదరాబాద్ గిరిజన మ్యూజియం పర్యవేక్షకులు డాక్టర్ డి. సత్యనారాయణ ‘రామప్ప దేవాలయం, ఆ ప్రాంత చరిత్ర – సాంస్కృతిక మానవశాస్త్రం’ అనే అంశంపై వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. రామప్ప ప్రాంత చారిత్రక నేపథ్యం, స్థానిక ప్రజల జీవన విధానాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు, క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్ రావు ఉన్నారు.
వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ల క్యాంపులో
నిపుణుల బోధన


