వైద్యం.. దైన్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. దైన్యం

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెతో

నిలిచిన సేవలు

● 78 కేడర్ల ఉద్యోగుల

క్రమబద్ధీకరణకు డిమాండ్‌

● 13 రోజులుగా కొనసాగుతున్న

ఆందోళన

ఉద్యోగుల డిమాండ్లు..

దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్‌హెచ్‌ఎం–జేఏసీ నాయకులు కోరుతున్నారు. 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కేడర్‌ వారీగా వేతనాలు చెల్లించాలని, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల విధానాన్ని పున పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగులను స్టేట్‌ హెల్త్‌ సొసైటీ పరిధిలో కొనసాగించాలని వేడుకుంటున్నారు. ప్రతినెలా 5వ తేదీ లోపు వేతనాలు, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయలిటీ బోనస్‌ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని.. అర్హత మేరకు కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలని, జీవో నంబర్‌ 1195ను పున పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గోవిందరావుపేట: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమ్మెతో రోగులకు వైద్య సేవలు అందడం దైన్యంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు 13 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరో వైపు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.

జిల్లాలో 295 మంది ఉద్యోగులు

జిల్లా వ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 295 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిలో 85 మంది రెండో ఏఎన్‌ఎంలు, 15 మంది కాంటింజెంట్‌ వర్కర్లు, 10 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓలు) ఉన్నారు. అలాగే 12 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 8 మంది ఎంసీహెచ్‌ మెడికల్‌ ఆఫీసర్లు, ఆయుష్‌, ఆర్‌బీఎస్‌కే, పీడీఎంఓఎస్‌ విభాగాలకు చెందిన 58 మంది వైద్యాధికారులు నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్నారు. అదే విధంగా 51 మంది స్టాఫ్‌ నర్సులు ఉండగా నలుగురు థియేటర్‌ అసిస్టెంట్లు, 15 మంది ఫార్మసిస్టులు, 9 మంది సపోర్టింగ్‌ సిబ్బంది, నలుగురు స్వీపర్లు, టీబీ యూనిట్‌లో 8 మంది, ఒక వీసీసీఎం, ఒక డీఏఎం, ఇద్దరు డీడీఎంలు, ఒక డీపీఓ ఉన్నారు. వీరంతా ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, వైద్య సేవల నిర్వహణలో నిరంతరం భాగస్వాములు అవుతున్నారు.

కీలక సేవల్లో ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది

కేంద్ర ప్రభుత్వం సుమారు 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎక్స్‌రే సిబ్బంది, టీబీ, మలేరియా, కుష్ఠు, ఎన్‌సీడీ విభాగాల సిబ్బందితో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, స్వీపర్లు వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పరీక్షలు, మందుల పంపిణీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణలో వీరు భాగస్వాములవుతున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వాగులు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ వైద్యసేవలు అందించడంలోనూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తుంది.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

20 ఏళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. కోవిడ్‌ సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. మా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నాం.

– డాక్టర్‌ బి.నరహరి, ఎన్‌హెచ్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement