వెంకటాపురం(కె): రాబోయే రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఏటూరునాగారం ఏడీఏ వేణుగోపాల్ అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో ఎల్‌నిలో ప్రభావం, వైవిధ్య పంటలపై రైతులు, డీలర్లకు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా రాబోయే రబీ సీజన్‌లో వరిపంట సాగు చేయవద్దని రైతులకు సూచించారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు, స్వల్పకాలిక రకాలైన పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేసే దిశగా రైతులు ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్, అత్మ డైరెక్టర్ మన్నెం సునీల్, కొండపర్తి సీతాదేవి, పల్నాటి నాగేశ్వరావు పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
ములుగు రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు ములుగు సర్కిల్ సూపరింటెండెంట్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ఇంటర్లింక్, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు, ప్రతీ సబ్‌స్టేషన్‌కు రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని వెల్ల డించా రు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో విద్యుత్ లైన్‌లో, సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు వినియోగదారులకు త్వరగా ప్రత్యామ్నాయ మార్గంలో విద్యు త్ అందించేందుకు 33 కేవీ ఇంటర్లింక్ లైన్లు ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు.
జిల్లా ఉపాధ్యక్షుడిగా
వెంకటేశ్వర్లు
గోవిందరావుపేట: తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ఎస్.వెంకటేశ్వర్లను నియమించినట్లు రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు రేండ్ల సంతోష్, రాష్ట్ర నాయకులు జిలకర లక్ష్మణ్ రావు, పంచగిరి రమేశ్, శ్యామ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలోని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
ములుగు రూరల్: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల కోసం ఉచిత ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతామని వివరించారు.


