ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, శానిటరీ ఇనన్‌స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ సంయుక్తంగా ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, ట్రేడ్ లైసెన్స్‌లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, వంటగది పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, ట్రేడ్ లైస్సెన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సమయంలో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు శ్రీ ఆధ్య రెస్టారెంట్, అరేబియన్ మండి యజమానులకు రూ.5వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రతీ హోటల్, రెస్టారెంట్ యజమాని బాధ్యతగా ఉండాలని సూచించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయాలని సూచించారు. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని, అదేవిధంగా ట్రేడ్ లైస్సెన్లు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


