మంగపేట: ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గొత్తికోయలు ఎవరైనా అనారోగ్యంతో గురైతే మంచంలో మోసుకెళ్లాల్సిన వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని ప్రాజెక్టునగర్ గొత్తికోయగూడెం అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సుమారు 20కి పైగా గొత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గూడెంకు చెందిన మడకం శ్రీనుకు గతంలో కాలుకు గాయమైంది. సరైన వైద్యం అందక కాలుకు ఇన్‌ఫెక్షన్ కావడంతో కొద్ది రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. గూడెం వద్దకు అంబులెన్స్ రావడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదు. దీంతో బాధితుడిని మంచంలో పడుకోబెట్టి అతని కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది ఈఎంటీ రాము, పైలట్ మధుకుమార్ సుమారు అరకిలో మీటర్ దూరం వరకు మోసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.


