● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు రూరల్: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రీసెర్చ్ రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలు చేసే దిశగా జిల్లాలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించినట్లు వివరించారు. తలసేమియా, రక్తహీనత, టెలిమెడిసిన్ సేవలు విస్తరించడం, సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగీ, క్షయ వంటి వ్యాధులపై ప్రత్యేకంగా మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, ములుగు, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు చంద్రశేఖర్, సురేశ్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలను పాటించాలి
ములుగు నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్ 25 నుంచి బూత్‌స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారని తెలిపారు. జిల్లాలో సుమారు 83.03 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైలేజేషన్ పూర్తి అయిందని వివరించారు. బూత్‌లెవల్ ఏజెంట్లు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. డిజిటైలేజేషన్ ఫారాలను తప్పకుండా అప్‌లోడ్ చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. అనంతరం వచ్చే నెల 10 నుంచి ప్రారంభమయ్యే క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటర్ల పేర్ల చేర్పు, సవరణ, తొలగింపు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


