● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నియంత్రణకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ, అతిసార, టైఫాయిడ్ వ్యాధుల పట్ల జిల్లా టీంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీహెచ్‌సీల పరిధిలో టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో మలేరియా, డెంగీ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులు ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి రవితేజ, ఏఎంఓ దుర్గారావు, మాస్ మీడియా అధికారి సంపత్ పాల్గొన్నారు.


