హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేతరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.
కేయూ క్యాంపస్: టీఎన్‌ఎస్ ముంబై ఇండియా ఫౌండేషన్‌తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల ఎంఓయూ మంగళవారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు ఆ ఫౌండేషన్ ఉచితంగా 200 గంటల ఉచిత శిక్షణ ఇవ్వనుందని ఆకళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. సరైన కేరీర్ ఆప్షన్, కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ స్కిల్స్‌తో పాటు అప్‌లై ఎ జాబ్, టూల్స్, కవరింగ్ లెటర్, మాక్ ఇంటర్వూలపై, అనేక నైపుణ్యాలు పెంచేందుకు ఆ ఫౌండేషన్ సహకారం అందించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్, ఏఆర్ శ్రీలత, కామర్స్ విభాగం అధ్యాపకుడు డాక్టర్ స్వామి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గిరిప్రసాద్, టీఎన్‌ఎస్ ముంబై ప్రతినిధులు ఆ మేనేజర్ కమ్ ట్రైనర్స్ సౌరవ్ పాండే, దేవిక, ఎస్.దీపు తదితరులు పాల్గొన్నారు.
అడ్వెంచర్ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: సాహస రంగంలో విజయాలను గుర్తించడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందించే ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ ఎంపికలకు ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కొత్త ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమి, సముద్రం, గాల్లో సాహస కార్యకలాపాలకు ఒక్కొక్కరికి ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. అదనంగా, సాహస రంగంలో ‘జీవిత సాఫల్యత’ కోసం ఒక అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మూడేళ్ల నుంచి చేసిన సాహస కృత్యాల గురించి వివరిస్తూ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేసి ఆగస్టు 20వ తేదీలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాళేశ్వరంలో
అష్టతీర్థాలకు శ్రీకారం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పూర్వపు అష్టతీర్థాలకు రూ.60కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆర్కిటెక్చర్ బృందం కాళేశ్వరంలో పర్యటించి అష్టతీర్థాలపై సర్వే చేపట్టింది. అష్ట తీర్థాలను అభివృద్ధి చేసి ఘాట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. వీఐపీ ఘాట్‌లోని సంగమ తీర్థం ఇప్పటికే అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7 వరకు జరుగు గోదావరి నది పుష్కరాల వరకు నిర్మాణాలు చేపట్టడానికి సన్నద్ధమయ్యారని తెలిసింది. ప్రస్తుతమున్న సరస్వతీఘాటు ఎగువన ఉన్న పక్షి తీర్థం నుంచి హనుమత్ తీర్థం అంతర్రాష్ట్ర వంతెన వరకు 3.5 కిలోమీటర్ల మేర ఘాట్ల తీర్థాఽలను కలుపుతూ బండ్ నిర్మాణాలు చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆయా బండ్‌ల వద్ద ఆయా తీర్థాలకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తారని దేవాదాయశాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పేర్కొంది.


