ఏటూరునాగారం/ వాజేడు: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల్లోని చెరువులు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మరోపక్క రైతుల్లో ఆనందం నెలకొంది. పంటలకు ప్రాణం వచ్చినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వాజేడులో వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కన్నాయిగూడెంలో నమోదైంది. వాజేడులో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ 163 జాతీయ రహదారి కొట్టుకుపోయి రవాణా స్తంభించింది. అలాగే 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డు తెగిపోయి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కొండాయి బ్రిడ్జి వద్ద అధికారులు ప్రతీ ఏడాది వర్షాకాలంలో గ్రామస్తులు వాగు దాటేలా తాత్కాలికంగా పడవలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోఉన్న జంపన్నవాగు ఉప్పొంగడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలను స్తంభించాయి. దీంతో అధికారులు వాగు దాటేందుకు పడవను ఏర్పాటు చేశారు.
జోరందుకున్న నాట్లు
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. వర్షం పడుతున్నా మరో పక్క నాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షం కురుస్తుందా లేదా అని నెల రోజుల పాటు వేచి చూసిన రైతుల కళ్లలో ఆనందం నెలకొంది. ప్రభుత్వం సన్నరకం పంటలను సాగు చేస్తేనే బోనస్ ఇస్తామనే నిబంధనలు పెట్టడంతో రైతులు సన్నరకానికి మొగ్గు చూపారు. అలాగే పత్తి పంటకు వర్షం జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కలుపు తీస్తుండగా మరికొందరు కలుపును ఎడ్లతో దున్నుతున్నారు. అలాగే పోడు భూములను రైతులు నాగళ్లతో దున్నడంతో పాటు ఇతర వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పలువురు గిరిజన రైతులు పోడు భూముల పక్కనే ఊట కుంటలను తవ్వి నీటి నిల్వలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
చత్తీస్‌గఢ్‌కు రాకపోకలు బంద్
వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ఉదయం 9 గంటల వరకు బాగానే ఉన్నా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా రావడంతో రహదారి కొంచెం కొంచెంగా కోతకు గురవుతూ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకుని అప్రమత్తమైన ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్, వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కృపాకర్, ఎస్సై జక్కుల సతీష్, ఎంపీఓ చందూలాల్ అక్కడికి వెళ్లి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే వాజేడు వద్ద జాతీయ రహదారి తెగిపోవడంతో అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి వసంత్(అనూష) 5వ కాన్పు కోసం పేరూరు వైద్యశాలకు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ట్రాక్టర్ ద్వారా ఆమెను కోయవీరాపురం గ్రామం వరకు వచ్చేలా ఏర్పాటు చేసి అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అలాగే గర్భిణులను 102 వాహనంలో సిబ్బంది పరీక్షల నిమిత్తం ఏటూరునాగారం వైద్యశాలకు తీసుకెళ్లే వారిని రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.
వాజేడు
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌కు
నిలిచిపోయిన రాకపోకలు
పూర్తిగా తెగిన
కొండాయి డైవర్షన్ రోడ్డు
వాజేడులో అత్యధికంగా
112.6 మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
మంగపేట
తాడ్వాయి
గోవిందరావుపేట
ములుగు
మల్లంపల్లి
ఏటూరునాగారం
వెంకటాపురం(ఎం)
వెంకటాపురం(కె)
కన్నాయిగూడెం


