ఏటూరునాగారం/కన్నాయిగూడెం: సమ్మక్క బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయకుండా దిగువకు వదిలేస్తూ నీటిని వృథా చేయడం బాధాకరమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. శుక్రవారం కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్‌ను నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడ నీటి నిల్వలు, వాటి వివరాలను డీఈ ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల పంప్‌హౌస్ వద్దకు వెళ్తుండగా పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకొని అనుమతి లేదని వెనకకు పంపించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహరావు విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్‌లోని మూడు గేట్లు తెరిచి నీటిని వృథాగా కిందికి వదిలివేయటం సరైన పద్ధతికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచించి దేవాదుల నీటిని రైతులకు అందేవిధంగా చేయాలన్నారు. మంత్రి సీతక్క ఎన్నికల ముందు ములుగు నియోజకవర్గ ప్రజలకు దేవాదుల ద్వారా అన్ని మండలాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఇప్పటివరకు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుగ్గుల సమ్మయ్య, పూజారి కిషోర్, చిన్ని కృష్ణ, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, ప్రదీప్‌రావు, కూనూరు అశోక్, కొమురం ధనలక్ష్మీ, తాడూరి రఘు, ఖాజాపాషా, యలవర్తి శ్రీనివాసరావు, కుర్బాన్ అలీ, పులుసం పురుషోత్తం, పొదెం కృష్ణప్రసాద్, కుమ్మరి చంద్రబాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనర్సింహారావు


