ములుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా ఇసుకను తరలించి నాలుగు వేల కోట్ల రూపాయలను కాజేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇప్పటికే ఒక కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఇసుక అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌కు ఇటీవల వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, అక్రమంగా తవ్విన ఇసుక విక్రయాలను నిలిపివేసే ఉత్తర్వులు తొందరలోనే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే మైనింగ్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చించాల్సిన ప్రభుత్వం ఇసుక కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ఇసుక లారీల ప్రమాదాల్లో 40 నుంచి 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గోవిందరావుపేట మండలంలో బీసీ లోన్ మంజూరుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసిన తహసీల్దార్, ఆర్‌ఐను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం అమాయకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారిని మొద్దుకు వేసిన ఫొటోలను సైతం కాంగ్రెస్ నేతలకు పంపుతున్న పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండలాద్యక్షుడు సానికోమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు మల్క రమేశ్, చెన్న విజయ్, నూనవత్ మహేశ్, బైకాని సాగర్, గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, అమర్‌సింగ్, ఓదేలు, భిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి


