సాంకేతిక విద్యకు ప్రాధాన్యం
ములుగు రూరల్: ప్రస్తుత సమాజంలో సాంకేతిక విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉందని అదనపు కలెక్టర్ సంపత్‌రావు సూచించారు. మండల పరిధిలోని గౌస్‌పల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో గురువారం డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ఆయన ప్రారంభించారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగాంగా డిజిటల్ విద్యాభివృద్ధికి స్మార్ట్ టీవీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృశ్య, శ్రవణ పద్ధతుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్ధంచేసుకోవడంతో పాటు ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ వనరులను ఉపయోగించుకోవటం ద్వారా విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. అనంతరం డీఈఓ సిద్ధార్ధరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాల అభివృద్ధికి దిశ ఫౌండేషన్, ఈఎల్‌ఎఫ్ లెర్న్ టు రీడ్ ఇంగ్లిష్ ఇన్ 90 రోజుల కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో స్మార్ట్ టీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఎనిమిదేళ్లలో 8 పాఠశాలలకు అదానీ గ్రూప్ స్మార్ట్ టీవీలను అందించిందని వెల్లడించారు. వాటిని ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ అర్షం రాజు, పాఠశాల హెచ్‌ఎం లక్కి సమ్మయ్య, అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రశాంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంపత్‌రావు


