అతివల మొగ్గు ఎటువైపో!
మహిళా సంఘాల సభ్యులను పలకరిస్తూ..
ములుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే కీలకం
ములుగు: ములుగు మున్సిపాలిటీలో అతివలదే ఆధిపత్యం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికలను మహిళలే పోషించనున్నారు. మున్సిపాలిటీలో 13,963 మంది ఓటర్లు ఉండగా 7,300 మంది మహిళలు ఉన్నారు. 6,661 మంది పురుషులు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పురుషులకంటే 639 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో అన్ని పార్టీల నాయకులు మహిళలను తమవైపు తిప్పుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో 20 వార్డులకు 10 వార్డులను మహిళలకే కేటాయించగా, మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ సైతం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల్లోని నేతలు తమ సతులను ఎన్నికల బరిలో దింపేందుకు సన్నద్ధమయ్యారు. ఎలాగైనా మహిళా ఓటర్లను ఆకర్షించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీలో నిలబడే వ్యక్తులు తమకు అనుకూలమైన వార్డుల్లో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పార్టీపరంగా ప్రచారం కాకుండా సొంత ప్రచారమే ఎక్కువగా నిర్వహించుకుంటూ తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బరిలో ఉంటామని తమను గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తున్నారు.
అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే అధికం
ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 16 వార్డుల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండగా కేవలం 4 వార్డుల్లో మాత్రమే పురుషులు అధికంగా ఉన్నారు. 1వ వార్డులో మహిళలు 350, పురుషులు 321, 2వ వార్డులో మహిళలు 404, పురుషులు 333, 3వ వార్డులో 410 మహిళలు, 342 పురుషులు, 4వ వార్డులో 393 మహిళలు, 380 పురుషులు, 5వ వార్డులో 355 మంది మహిళలు, 299 పురుషులు, 6వ వార్డులో 312 మహిళలు, పురుషులు 315, 7వ వార్డులో 364 మంది మహిళలు, 371 పురుషులు, 8వ వార్డులో 342 మహిళలు, 355 పురుషులు, 9వ వార్డులో 366 మహిళలు, 329 పురుషులు, 10వ వార్డులో 395 మంది మహిళలు ఉండగా 350 పురుషులు ఉన్నారు. అలాగే 11వ వార్డులో మహిళలు 367, పురుషులు 344, 12వ వార్డులో మహిళలు 409, పురుషులు 381, 13వ వార్డులో 362 మహిళలు, 326 పురుషులు, 14వ వార్డులో 402 మహిళలు, 354 పురుషులు, 15వ వార్డులో 379 మహిళలు, 380 పురుషులు, 16వ వార్డులో 325 మహిళలు, పురుషులు 291, 17వ వార్డులో 317 మహిళలు, 312 పురుషులు, 18వ వార్డులో 345 మహిళలు, 293 పురుషులు, 19వ వార్డులో 337 మహిళలు, 277 పురుషులు, 20వ వార్డులో 366 మహిళలు ఉండగా 308 పురుషులు ఉన్నారు. 6,7,8,15 వార్డుల్లో మినహా మిగిలిన అన్ని వార్డుల్లోని గెలుపోటముల్లో మహిళలదే తుది తీర్పు కానుంది.
వారి ఓట్లకోసం నేతల యత్నాలు
మహిళా సంఘాలకు ఇప్పటి నుంచే
తాయిలాల ప్రకటనలు
మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న ఆశావహులు మహిళల ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలను కలుస్తూ వారికి కావాల్సిన పనులు చేస్తామని హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళల ఓట్లకోసం కొన్ని వార్డులలో సతులతో ప్రచారం చేపిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఏకతాటిపై ఉంటారనే నమ్మకంతో వారి ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉండటంతో గ్రూపు సభ్యులతో పాటు లీడర్లను కలుస్తున్నారు. సంఘాలకు ఎలాంటి రుణాలు కావాలన్నా తాము ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా మహిళా సంఘాల్లో ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.


