గోదావరి జలాలు అందించడమే లక్ష్యం
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీవంతరావుపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.5 లక్షలతో నిర్మించిన హనుమాన్ టెంపుల్ ప్రహరీని, రూ.3.50 కోట్లతో నిర్మించిన డబుల్ లైన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డితో కలిసి సీతక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు నిర్మించినప్పటికీ అప్పటి పాలకులు వారి వారి ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించుకుపోయారని తెలిపారు. జిల్లాకు మాత్రం గోదావరి జలాలు అందలేదన్నారు. గోదావరి జలాలను ములుగు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందించి రెండు పంటలు పండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. జీవింతరావుపల్లిలో ఇందిరమ్మ పథకంలో భాగంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ములుగు డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో పాటు వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. ములుగులో రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫాంను ప్రారంభించడంతో పాటు క్యాంపు కార్యాలయంలో 8 మంది లబ్దిదారులకు ీసీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సీతక్క అందజేశారు.


