ఖర్చు పెట్టేవారికే టికెట్లు! | - | Sakshi
Sakshi News home page

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!

Jan 22 2026 7:23 AM | Updated on Jan 22 2026 7:23 AM

ఖర్చు

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!

ఖర్చు పెట్టేవారికే టికెట్లు! ప్రజాబలం కంటే ధన బలం వైపే పార్టీల మొగ్గు

టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు

ప్రజాబలం కంటే ధన బలం వైపే పార్టీల మొగ్గు

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి

ఆశావహుల ప్రయత్నాలు

సోషల్‌ మీడియా వేదికగా

గెలిపించాలని ప్రచారం

ములుగు: ఎన్నికల బరిలో నిలవాలన్నా.. ప్రత్యర్థిపై గెలవాలన్నా.. మంది మార్బలంతో పాటు ఆర్థిక బలం ఉండాల్సిందే. ఓటుకు వేల రూపాయలిచ్చి లక్షలు ఖర్చు పెడితేనే మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. పార్టీలలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ పార్టీకి సేవలందించిన వారిని సైతం పక్కన పెట్టి లక్షల్లో ఖర్చు చేసే అభ్యర్థుల వైపే ప్రధాన పార్టీలు మొగ్గుచూపుతున్నట్లు చర్చ సాగుతోంది. కౌన్సిలర్‌కు లక్షలు, చైర్మన్‌ పీఠానికి కోట్లు ఖర్చు చేస్తేనే టికెట్లు ఖరారు చేసే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు తెలిసింది. కౌన్సిలర్‌ పదవులకు ప్రధాన పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులనే మున్సిపల్‌ ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నాయి. పార్టీ ఫండ్‌తో పాటు స్వయంగా ఖర్చు చేసే నేతలను వెతుకుతున్నాయి. అర్థబలం, అంగబలం ఉన్న వారిని బరిలో దింపితే ఎన్నికల ఖర్చుకు వెనుకాడరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పదవి కోసం ఎంతైనా..

ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేశారు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. ఓటుకు రూ. 2 వేల నుంచి మొదలుకొని రూ. 5 వేల వరకు ఇచ్చే అభ్యర్థుల వైపు పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో వార్డులో సుమారు రూ.15 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓటర్ల మద్దతు కోసం పాట్లు

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు ఇప్పటికే కాలనీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడుతున్నామని, తమకు మద్దతు తెలపాలని ఓటర్లను వేడుకుంటున్నారు. పలాన వార్డులో నిలబడుతున్నానని సోషల్‌ మీడియా వేదికగా ఓటర్లకు సంకేతాలు పంపుతున్నారు. ఎలాగైనా తమను గెలిపించాలని కోరుతూ ఇప్పటి నుంచే మందు, విందులు ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

వారంలో నోటిఫికేషన్‌

వారం రోజుల్లోగా మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ములుగు మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలుపుకొని నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 20 వార్డులలో 3 ఎస్సీ, 2 ఎస్టీ, 5 బీసీ, 10 జనరల్‌ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. 20 వార్డుల పరిధిలో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ములుగు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలని చూస్తున్నారు. అధిష్టానం వద్ద టికెట్ల కోసం ప్రయత్నిస్తూనే డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఓవైపు టికెట్ల కోసం ఆరాటం మరోవైపు ఓటర్ల మద్దతు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!1
1/2

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!2
2/2

ఖర్చు పెట్టేవారికే టికెట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement