మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ములుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ నుంచి ఆమె బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో కమిషన్ విడుదల చేస్తుందన్నారు. షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికతో సిద్ధం చేసుకోవాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతీ పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సోషల్ ఎలిమెంట్స్‌ను బైండోవర్ చేయాలని వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ములుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలను టీ– పోల్‌లో నమోదు చేసినట్లు కలెక్టర్ వివరించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద వెబ్‌కాస్టింగ్, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులకు మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై దిశానిర్దేశం చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణికుముదిని


