మహాజాతర పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున తుది దశకు చేరుకున్న అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి, అవసరమైన మెరుగులు దిద్దాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్‌లో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం జంపన్నవాగులో నిరంతరం షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాతర ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లను మోహరించాలని తెలిపారు. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడారం జాతరను సమర్థవంతంగా విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇటీవల సీఎం పర్యటన, కేబినెట్ సమావేశం, గద్దెల పునఃప్రారంభం కార్యక్రమాలు అంతరాయాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
మహాజాతర పనులు త్వరగా పూర్తిచేయాలి


