అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌

Jan 20 2026 7:32 AM | Updated on Jan 20 2026 7:32 AM

అన్నద

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌ 15 వేల ఎకరాలకు సాగునీరు.. ఆనందంగా ఉంది..

మూడు వరుసల్లో

పైపులైన్‌ నిర్మాణం

ఎత్తిపోతల పథకానికి కేబినెట్‌ ఆమోదంతో రైతుల్లో ఆనందం

ములుగు: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ములుగు రైతాంగానికి రాష్ట్ర కేబినెట్‌ తీపి కబురు అందించింది. జిల్లా కేంద్రం పరిధిలోని మదనపల్లి, జగ్గన్నపేట, అన్నంపల్లి, పత్తిపల్లి, పొట్లాపూర్‌, ములుగు, జంగాలపల్లి, బండారుపల్లి గ్రామాల పరిధిలోని 30 చెరువులు, కుంటలకు రామప్ప రిజర్వాయర్‌ ద్వారా దేవాదుల నీటిని అందించనున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవతో పొట్లాపూర్‌ ఎత్తిపోతల పథకానికి ఆదివారం మేడారంలో నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. రామప్ప సరస్సు రిజర్వాయర్‌ ద్వారా రంగరావుపల్లి పంపుహౌస్‌ వద్ద ఇంటెక్‌వెల్‌ నిర్మించి మూడు వరుసల్లో పైపులైన్‌ నిర్మాణం చేపట్టి గొలుసుకట్టు చెరువులకు సాగునీటిని అందించనున్నారు.

రూ.143 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌

జిల్లా పరిధిలోని 8 గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది రైతులు పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో లబ్ధిపొందనున్నారు. 8 గ్రామాల పరిధిలో సుమారు 30 చెరువులు, కుంటలు ఉండగా ప్రతిఏటా సరిగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయేవారు. రూ.143 కోట్లతో చేపట్టనున్న పొట్లాపూర్‌ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్‌ ఇరిగేషన్‌) ద్వారా రామప్ప సరస్సు నుంచి దేవాదుల నీటిని 30 చెరువులకు ప్రత్యేక పైపులైన్‌ ద్వారా అందించనున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం రావడంతో రైతులు సంబరపడిపోతున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క

చిత్రపటాలకు క్షీరాభిషేకం

ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేట గ్రామపంచాయతీ వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. సుమారు 4 వేల మంది రైతులకు మేలు జరిగే విధంగా పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్‌పాషా, చింతనిప్పుల భిక్షపతి, గండ్రత్‌ జయకర్‌, మర్రి రాజు, జక్కుల రేవంత్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

రామప్ప చెరువు

పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తాం. కేబినెట్‌ మీటింగ్‌లో పొట్లాపూర్‌ ప్రాజెక్ట్‌కు రూ.143 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామప్ప రిజర్వాయర్‌ నుంచి లక్నవరానికి కూడా దేవాదుల నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సుమారు రూ.35 కోట్లతో పనులు చేపట్టేలా కేబినెట్‌లో చర్చించి ప్రకటించాం.

– ధనసరి సీతక్క, మంత్రి

పొట్లాపూర్‌ ప్రాజెక్టుతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు దేవాదుల నీటితో నిండనున్నాయి. పంటలు ఎండిపోతాయనే భయం పోయింది. రెండు పంటలు పండించుకునేందుకు అవకాశం రావడంతో ఆనందంగా ఉంది. చెరువుల కింద ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు కలుగుతుంది. నాలుగు ఎకరాలు వరిసాగు చేసి సాగునీటికి ప్రతీసారి ఇబ్బందిపడేవాడిని. ఇక నుంచి ఎంతోమంది రైతులకు న్యాయం జరుగుతుంది.

– ఇజ్జగిరి నాగన్న, పొట్లాపూర్‌ రైతు

పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ద్వారా జిల్లా కేంద్రం సమీపంలోని రంగరావుపల్లి పంపుహౌస్‌ వద్ద నుంచి రామప్ప నీటిని తరలించనున్నారు. ఇందుకోసం పంపుహౌస్‌ నుంచి మూడు వరుసల్లో పైపులైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి పైపులైన్‌ జంగాలపల్లి చెరువులోకి, రెండో పైపులైన్‌ కోమటి చెరువు, లోకం చెరువులోకి, మూడో పైపులైన్‌ పొట్లాపూర్‌ చింతల చెరువు, బుగ్గ చెరువు వరకు నిర్మాణం చేపట్టి ఆయా చెరువుల్లోకి నీటిని పంపింగ్‌ చేస్తారు. అక్కడి నుంచి మిగిలిన గొలుసుకట్టు చెరువులకు, కుంటలకు నీటిని తరలించనున్నారు. ఈ క్రమంలో దారిలో ఉన్న ఆయకట్టు పొలాలకు సైతం సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైన్‌ రూపొందించారు. కంతనపల్లి నుంచి రామప్ప సరస్సుకు వచ్చే నీటిని తీసుకొని 90 రోజుల్లో 0.80 టీఎంసీల నీటిని పొట్లాపూర్‌ పథకంలో భాగంగా ఎత్తిపోస్తారు. 30 చెరువులకు, కుంటలను గోదావరి నీటితో నింపి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

8 గ్రామాల పరిధిలో 30 గొలుసుకట్టు చెరువులకు గోదావరి నీరు

రూ.143 కోట్లతో మూడు వరుసల్లో పైపులైన్‌ నిర్మాణం

7,556 ఎకరాల ఆయకట్టుకు

అందనున్న సాగునీరు

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌
1
1/2

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌
2
2/2

అన్నదాతలకు వరం.. పొట్లాపూర్‌ లిఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement