మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీలేని రుణాలు
ములుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి పట్టణ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీని త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌లతో కలిసి డిప్యూటీ సీఎం సోమవారం కలెక్టర్లతో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళా సంఘాలలో సభ్యులుగా లేని వారిని రేషన్‌కార్డు ఆధారంగా గుర్తించాలన్నారు. పంపిణీ కార్యక్రమంలో రద్దీ లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ చేపడతామని, అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టివిక్రమార్క


