2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్‌.. భారీ డిజాస్టర్‌ చిత్రాలివే! | Year End RoundUp 2023: List Of Remake Movies In Tollywood Failed To Make A Mark In Telugu Cinema In 2023 - Sakshi
Sakshi News home page

2023 Year End RoundUp: బెడిసికొట్టిన రీమేక్‌.. భారీ డిజాస్టర్‌ చిత్రాలివే!

Published Sun, Dec 24 2023 11:41 AM

Year End RoundUp 2023: List Of Remake Movies In Tollywood Failed To Make A Mark In Telugu Cinema In 2023 - Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్‌ హిట్‌ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్‌ చేసేవారు. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్‌ హీరోలంతా రీమేక్‌ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్‌ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్‌ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్‌ చిత్రాలు అన్ని బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. 

బోల్తా పడిన భోళా శంకర్‌
ఈ ఏడాది విడుదలై డిజాస్టర్‌ అయిన చిత్రాల్లో భోళా శంకర్‌ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌ మూవీ ఇది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్‌ హిట్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌. అక్కడ అజిత్‌ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్‌ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. చిరు కెరీర్‌లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్‌ ఒకటిగా నిలిచింది. 

భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’
పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే,  పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ నటన.. తమన్‌ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్‌ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి.

రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’
పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్‌ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్‌ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. 

కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’
చాలా కాలం తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్‌ అనిపించుకున్న ‘నటసామ్రాట్‌’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్‌ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. 

ఆకట్టుకోలేకపోయిన ‘హంట్‌’
ఈ ఏడాది  సుధీర్‌ బాబు చేసిన మరో ప్రయోగం హంట్‌. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్‌ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్‌ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్‌ అయింది.  ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌),  నవంబర్‌లో రిలీజైన  కోట బొమ్మాళి పీఎస్‌(మలయాళ సూపర్‌ హిట్‌ ‘నాయట్టు’ తెలుగు రీమేక్‌) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement