
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్ రోల్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ 30 నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తారని మంచు విష్ణు తెలిపారు. కన్నప్ప 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉందని అన్నారు. కన్నప్ప పరివర్తనలో కీలక పాత్ర పోషించే దైవిక వ్యక్తిగా ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ సినిమాను ఆధ్యాత్మిక మార్గంలో బయలుదేరే ఒక నాస్తికుడి గురించిన పౌరాణిక కథగా తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రభాస్‌కు మోహన్ బాబుతో ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయని వివరించారు. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలకే పరిమితం అయినప్పటికీ.. బలమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలలో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రీ-కాళహస్తి అనే పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ మే 28న విడుదల కానుంది. ఈ భక్తి గీతంలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.