
మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) అని అందరికీ తెలుసు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తీశాడు. అందులో తనే కన్నప్ప పాత్రను పోషించాడు. మహాభారత్ సీరియల్ డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాడు. జూన్ 27న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.
2009లోనే..
అయితే విష్ణు.. కన్నప్ప కంటే ముందు రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని ప్రయత్నించాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు మాట్లాడుతూ.. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏమేం జరిగిందనే కథంతా నా దగ్గరుంది. దీనిపై సినిమా తీయాలని నేను గతంలోనే అనుకున్నాను. ఈ ప్రాజెక్టులో సూర్య రాముడిగా నటిస్తే బాగుంటుందనుకున్నాను. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు 2009లో సూర్యను కూడా సంప్రదించాను.
హనుమంతుడిగా చేయాలనుకున్నా..
రాఘవేంద్రరావును డైరెక్టర్‌గా అనుకున్నాను. అయితే రాఘవేంద్రరావుకు నేను హనుమంతుడి రోల్ చేయడం ఇష్టం లేదు. ఇంద్రజిత్తుడి పాత్ర చేస్తే బాగుంటుందన్నారు. రావణుడి పాత్ర మా నాన్న పోషించాల్సింది. స్క్రిప్టు.. డైలాగులు అన్నీ పూర్తయ్యాయి, కానీ బడ్జెట్ సమస్య వల్ల సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో రామాయణ మూవీ చేస్తానో, లేదో కూడా తెలీదు!
సీతగా ఎవరంటే?
ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం రాముడిగా మళ్లీ సూర్యనే ఎంపిక చేసుకుంటాను. సీతగా ఆలియాభట్‌ను సెలక్ట్ చేస్తాను. రావణుడిగా మా నాన్నను కాకుండా ఎవరినీ ఊహించుకోలేను. హనుమంతుడి పాత్ర నేనే చేస్తాను. ఇంద్రజిత్తుగా సూర్య సోదరుడు కార్తీ, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, జటాయువుగా సత్యరాజ్ చేస్తే బాగుంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు.
భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో రామాయణ
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణ నిలిచింది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.
చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్