నా 25 ఏళ్ల కల.. కొత్త ప్రయాణం మొదలైంది: విశాల్‌ | Vishal Comments On His Detective Movie | Sakshi
Sakshi News home page

నా 25 ఏళ్ల కల.. కొత్త ప్రయాణం మొదలైంది: విశాల్‌

Mar 17 2024 12:19 PM | Updated on Mar 17 2024 12:44 PM

Vishal Comments On His Detective Movie - Sakshi

తెలుగు కుటుంబానికి చెందిన స్టార్‌ హీరో విశాల్‌ కోలీవుడ్‌లో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయనకు సౌత్‌ ఇండియాలో అన్నీ భాషల్లో అభిమానులు ఉన్నారు. 2017లో  మిస్కిన్ దర్శకత్వంలో విశాల్‌ నటించిన ‘డిటెక్టివ్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు విశాల్‌. డిటెక్టివ్‌2 పేరుతో త్వరలో సెట్స్‌పైకి ఈ చిత్రం వెళ్లనుంది. ఈ సినిమాకు ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా.. తన సినీ కెరియర్‌లో తొలిసారి డిటెక్టివ్‌2 చిత్రానికి దర్శత్వం వహించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

ఇండస్ట్రీలో 25 ఏళ్ల నా కల, ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నేను జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను అనే నా మొదటి ఆలోచన నిజమైంది. అవును, నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతను నేను తీసుకున్నాను., ఒక దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలైంది. తుప్పరివాలన్‌2..డిటెక్టివ్‌2 కోసం లండన్‌ బయలుదేరాం. అజర్‌బైజాన్‌, మాల్లాల్లో షూటింగ్‌ చేయబోతున్నాం. ఈ ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదు. మ‌నం పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సార్‌ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను.

నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా రానున్నాను. మీ అందరి మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్‌ సర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజ జీవితమైనా.. రీల్ జీవితమైనా నేను ఎవరి బిడ్డను అనాథగా విడిచిపెట్టను. గమ్యం చేరేలా చేస్తాను సార్.' అని విశాల్‌ తెలిపారు.

డిటెక్టివ్‌2 ప్రాజెక్ట్‌ను కూడా మిస్కిన్‌ దర్శకత్వంలోనే విశాల్‌ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ మూవీకి విశాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement