
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ ’(2023) చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్‌లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట.
ఇదిలా ఉంటే.. ‘జైలర్ 2’లో విద్యా బాలన్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్. ఇటీవల విద్యా బాలన్‌ని కలిసి, ‘జైలర్ 2’ కథ చె΄్పారట నెల్సన్. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.