
హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ క్రిస్టోఫర్ నోలన్ వినూత్న ప్రయోగం
‘ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లర్, టెనెట్, ఓపెన్‌హైమర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన అమెరికన్ ఫిల్మ్‌మేకర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా చేస్తున్న చిత్రం ‘ది ఒడిస్సీ’. మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హతావే, జెండయా వంటి హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. గ్రీకు పురాతన ఇతిహాస సాహిత్యాల్లో ప్రముఖమైన వాటిల్లో ఒకటిగా చెప్పుకునే హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం అనంతరం తన భార్య పెనెలోప్‌ను కలిసే క్రమంలో ఇథాకా గ్రీసు రాజు అధిగమించిన సమస్యలు, ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట.
ఎమ్మా థామస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నోలన్ కూడా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న విడుదల కానుంది. అంటే... సరిగ్గా ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ వినూత్నమైన విధానానికి నోలన్ నాంది పలికారు. అదేంటంటే... అమెరికాలోని కొన్ని ప్రముఖ థియేటర్స్‌లో ఇప్పుడే బుకింగ్స్‌ప్రారంభించారు.
అసలు... కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడమే తగ్గిపోయిన ఈ రోజుల్లో నోలన్ ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టడం, ఇందుకు ఆడియన్స్ నుంచి కూడా సానుకూల స్పందన రావడం చర్చనీయాంశమైంది. దాదాపు పాతిక థియేటర్లలో బుకింగ్ ఓపెనింగ్ అయిందని, టికెట్ల అమ్మకం జోరుగా జరిగిందని సమాచారం. మరో ఆసక్తికర విశేషం ఏంటంటే... ‘ది ఒడిస్సీ’ని పూర్తి స్థాయిలో ఐమ్యాక్స్ కెమెరాతోనే చిత్రీకరిస్తున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాతో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి చిత్రంగా ‘ది ఒడిస్సీ’ నిలవ నుంది. ఇలా రిలీజ్‌కు ముందే చర్చనీయాంశమైన ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.