Lata Mangeshkar Love Story: వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించిన లతా మంగేష్కర్‌

Untold Love Story Of Singer Lata Mangeshkar And Cricketer Raj Singh Dungarpur - Sakshi

మొహబ్బతే

ఇది గాయని లతా మంగేష్కర్‌ ప్రేమ కథ. ‘ఇంటికి పెద్ద కూతురు.. చిన్న వయసులోనే తోబుట్టువుల మంచి,చెడులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతకే జీవితాన్ని అంకింతం చేసి ఒంటరిగా మిగిలిపోయింది’ అని లతా మంగేష్కర్‌ గురించి తెలిసిన కొందరు చెబుతారు. ‘సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ల చేష్టలు .. వాటి పర్యవసానాలు పిల్లలకు పాఠాలవుతాయి. కానీ లతా విషయంలో అది రివర్స్‌ అయింది. ప్రేమ, పెళ్లికి సంబంధించి లతా చెల్లెలు ఆశా భోంస్లే తీసుకున్న తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు.. వాటి తాలూకు ఫలితాలు లతాను జీవితాంతం అవివాహితగానే ఉంచాయి’ అనేది ఇంకొందరు సన్నిహితుల అభిప్రాయం. ‘ఆమె ఇష్టపడ్డ మనిషి.. ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లకపోవడంతో ఏ తోడు లేకుండానే జీవితాన్ని గడిపేసింది’ అని మరికొందరి ఆప్తుల మాట.

లతా మంగేష్కర్‌ ప్రేమించిన వ్యక్తి.. క్రికెటర్, దుంగార్‌పూర్‌(రాజస్థాన్‌) సంస్థానాధీశుడు లక్ష్మణ్‌ దుంగార్‌పూర్‌ కుమారుడు.. రాజ్‌ సింగ్‌ దుంగార్‌పూర్‌. రంజీల్లో రాణించాడు. బీసీసీఐ (బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా)కు ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. అభిమాని.. లతా మంగేష్కర్‌ను, రాజ్‌ సింగ్‌ దుంగార్‌పూర్‌ను కలిపింది క్రికెటే. ఆమెకు క్రికెట్‌ మీద చక్కటి అవగాహన ఉంది. ఆ ఆటకు వీరాభిమాని కూడా. లతా ఒక్కరే కాదు మంగేష్కర్‌ కుటుంబమంతా క్రికెట్‌ అభిమానులే. దాంతో ఆమె తమ్ముడు హృదయనాథ్‌ మంగేష్కర్‌కి రాజ్‌ సింగ్‌ దుంగార్‌పూర్‌ మధ్య స్నేహం బలపడింది. అలా మంగేష్కర్‌ కుటుంబానికే ఆత్మీయుడిగా మారిపోయాడు అతను. ఆ సాన్నిహిత్యమే లతా, రాజ్‌ సింగ్‌ ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేసింది అంటారు ఇద్దరినీ ఎరిగిన మిత్రులు. 

పెళ్లిదాకా ఎందుకు రాలేదు?
‘మా తాత, మా అమ్మ, పిన్ని ఒప్పుకోకపోవడం వల్లే’ అంటుంది రాజ్‌ సింగ్‌ దుంగార్‌పూర్‌ మేనకోడలు రాజశ్రీ కుమారి. ‘సినిమా గాయని రాజ కుటుంబపు కోడలెలా అవుతుందనేది వాళ్ల అభ్యంతరం. నాకింకా గుర్తు.. నా చిన్నప్పటి విషయం ఇది..  ఒకసారి బాంబేలోని బికనీర్‌ హౌస్‌కి లతా మంగేష్కర్‌ని పిలిచారు. మా అమ్మ,  పిన్ని.. తమ తమ్ముడిని వదిలేయమని, అప్పుడే అతను తమకు తగినట్టుగా ఏ రాజ్‌పుత్‌ అమ్మాయినో లేదంటే ఏ రాజవంశస్తురాలినో చేసుకుంటాడు అని లతాకు చెప్పారు. కానీ లతాతో రిలేషన్‌షిప్‌ వదులుకోవడానికి మామయ్య ఇష్టపడలేదు’ అని రాజశ్రీ కుమారి తన ‘ది ప్లేస్‌ ఆఫ్‌ క్లౌడ్స్‌’ అనే పుస్తకంలో రాసింది. ఆమె రాసిన ఈ విషయాన్ని దుంగార్‌పూర్‌ వంశస్తులు ఖండించారు. రాజ్‌ సింగ్‌ కుటుంబ సభ్యుడొకరు  ‘రాజ్‌ సింగ్‌ మొదటి నుంచీ సర్వస్వతంత్రుడిగానే ఉన్నాడు. ఎవరో కట్టడి చేస్తే ఆగే మనిషి కాదు అతను. రాజ్‌ సింగ్‌ కన్నా లతా ఆరేడేళ్లు పెద్ద. వాళ్లది లేట్‌ వయసు ప్రేమ. బహుశా ఈ కారణాలతో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోకపోయుండొచ్చు’ అంటాడు.

ఇలా వాళ్ల ప్రేమ గురించి వాళ్లిద్దరి సన్నిహితులు చెప్పడమే కానీ ఇటు లతా మంగేష్కర్‌ కానీ.. అటు రాజ్‌ సింగ్‌ కానీ ఎప్పుడూ నిర్ధారించలేదు. అయితే తనకు అత్యంత ఆప్తుల్లో రాజ్‌ సింగ్‌ దుంగార్‌పూర్‌ ఒకరని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో లతా మంగేష్కర్‌ చెప్పారు. ఆమె కోసం రాజ్‌ సింగ్‌ లార్డ్స్‌ స్టేడియం గ్యాలరీలోని సీట్‌ను పర్మినెంట్‌గా రిజర్వ్‌ చేయించారనేది ప్రచారంలో ఉంది. ‘నిజమేనా?’ అని లతాని అడిగారు నస్రీన్‌ కబీర్‌ మున్ని.. ‘లతా మంగేష్కర్‌ .. ఇన్‌ హర్‌ ఓన్‌ వాయిస్‌’ పుస్తక రచయిత. దానికి లతా నవ్వుతూ ‘కాదు. లార్డ్స్‌లో నాకెలాంటి రిజర్వేషన్‌ లేదు. సామాన్య ప్రేక్షకుల్లాగే ఆ స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తా’ అని జవాబిచ్చారు.

‘రాజ్‌ సింగ్, లతా మంగేష్కర్‌లది పరిణతి చెందిన ప్రేమానుబంధం. దానికి లేనిపోని కల్పనలు జోడించొద్దు. ఆమెకు అతని ఆస్తి అవసరం లేదు. అతనికి ఆమె కీర్తితో సంబంధం లేదు. ఆ ఇద్దరికీ వాళ్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలున్నాయి. వాళ్ల సహజీవనానికి ఉన్న అడ్డంకులను అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు బలమయ్యారు.. పెళ్లితో కలవకపోయినా.. ప్రేమకు గౌరవమిచ్చారు ’ అని చెప్తారు ఇరు కుటుంబ సభ్యులు. రాజ్‌ సింగ్‌ కూడా అవివాహితుడిగానే నిష్క్రమించాడు. 

ప్రపంచానికేం అవసరం?
‘చాలా కాలంపాటు నేను డైరీలు రాశాను. కొన్ని కథలు, పాటలూ రాశాను హిందీలో. కానీ ఓ రోజు అనిపించింది.. అలా రాయడం వల్ల ఉపయోగమేంటీ అని. అందుకే వాటన్నిటినీ చించేశాను. ఆత్మకథ రాసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.  ఎందుకంటే ఆత్మకథ రాసేప్పుడు నిజాయితీగా ఉండాలని నమ్ముతాను. అయితే ఆ నిజాయితీ చాలా మందిని బాధపెట్టొచ్చు. ఇతరులను బాధపెట్టే రాతలెందుకు? నా జీవితం.. అదిచ్చిన అనుభవాలు నా వ్యక్తిగతం. వాటిని రాయడమెందుకు? నా వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా!’ అని చెప్పారు లతా మంగేష్కర్‌.
- ఎస్సార్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top