
నటి త్రిష గ్లామర్‌తో కూడిన ప్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కథా చిత్రాలతోనే మెప్పిస్తూ వచ్చింది. ఆ మధ్య కొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలలో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో అలాంటి కథా చిత్రాల జోలికి వెళ్లడం మానేసింది. అయితే ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించి ప్రశంసలను అందుకుంది. తాజాగా మరోసారి ఈ భామ యాక్షన్ అవతారం ఎత్తింది. ది రోడ్ అనే చిత్రంలో అలాంటి యాక్షన్ పాత్రలో నటిస్తోంది. రివెంజ్ ఇన్ 402 కేఎంఎస్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అరుణ్ విశాఖన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డాన్సింగ్ రోస్ షబ్బీర్, మియా జార్జ్, ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఏఏఏ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం, కేజీ వెంకటేష్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ దీపావళి సందర్భంగా విడుదల చేశారు. నటి త్రిష గన్ చేతపట్టి ఎవరికో గురి పెడుతున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇది 2000 సంవత్సరంలో మదురైలో జరిగిన ఒక యథార్ధ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న కథా చిత్రమని తెలిపారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న జనరంజక కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర టీజర్ విడుదల తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఈ చిత్రమైన త్రిష ఇమేజ్‌ను కాపాడుతుందా? అన్నది వేచి చూడాలి.