టైటిల్: సన్ ఆఫ్
దర్శకుడు.. బత్తుల సతీష్
నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్
విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026
సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్‌మెంట్ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.
ఎలా ఉందంటే..
తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.
కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


