
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్ సెట్‌లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్‌లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్‌లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్‌లో సరదా కోసమే చేశారు.
అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు.