
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber of Commerce)లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం జరిగిన ఈ భేటిక అల్లు అరవింద్, మైత్రీ రవి, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్ ఠాగూర్ మధు తదితరులు హాజరయ్యారు. కార్మికుల వేతనాలు 30% పెంచాలన్న ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్‌పై చర్చించారు.
అనంతరం నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాము. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే కూడా వీరి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాల పెంపు పర్సంటేజ్‌పై ఇంకా చర్చ నడుస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు అని తెలిపారు. ఈ సమావేశానికి మరోవైపు తమ సినిమాలకు పనిచేసే కార్మికులకు 30% వేతనం పెంపునకు అంగీకరిస్తూ కొంతమంది నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్‌కు లెటర్స్ ఇచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు, ఒక సినిమా ఓపెనింగ్, రెండు యాడ్ ఫిలింస్‌కు వర్క్ చేస్తోంది.
షూటింగ్స్ బంద్
తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాల పెంపు కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్, సయ్యద్ హుమాయూన్లను నియమించారు. వేతనాల పెంపు విషయంపై ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్- ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పేర్కొంది.
ఈ మేరకు అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ (అలెక్స్) ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నేటి నుంచి 30 శాతం వేతనం పెంచి ఇస్తామంటూ లేఖ ఇవ్వాలి. ఆ లేఖని ఫెడరేషన్ ద్వారా యూనియన్‌లకు అందజేసిన తర్వాతే చిత్రీకరణలకు హాజరవుతాం. అప్పటి వరకూ సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్స్‌కి కార్మికులు ఎవరూ హాజరు కాకూడదు. ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగినా వర్తిస్తాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మనమంతా ఐక్యతతో ఉండాలి: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ తీసుకున్న షూటింగ్స్ బంద్ నిర్ణయంపై ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘ప్రియమైన నిర్మాతలకు.. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పక్షపాతంగా 30శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం.
ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు సంబంధిత అధికారులతో ఛాంబర్ చర్చలు జరుపుతుంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశకాలను కచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్ కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అంటూ ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేరుతో ఆ లేఖ విడుదలైంది.