ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.
మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్‌కి స్పోర్ట్స్ స్టార్‌గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్‌లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.
అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.

ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.
నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.

తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.
వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది.


