Dhee 13 Winner: బిగ్‌బాస్‌ నుంచి ఢీ 13 వరకు.. తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు

Tandoor Artists Talent In Television Field - Sakshi

తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్‌ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్‌ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్‌బాస్‌– 4లో టాప్‌– 5 ఫైనలిస్ట్‌ల్లో నిలిచారు. టాలెంట్‌ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు.

తాండూరు టౌన్‌: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్‌– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్‌గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్‌ను చూసిన మాస్టర్‌ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్‌ డ్యాన్సర్‌గా చేరింది. మాస్టర్‌ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్‌ సీజన్‌– 2లో గ్రూప్‌ డ్యాన్సర్‌గా చేసింది.

తల్లిదండ్రులతో కావ్యశ్రీ 

అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్‌గా వైల్డ్‌కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్‌లో విన్నర్‌గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా టైటిల్‌తో పాటు ప్రైజ్‌ మనీ అందుకుంది.
}
ఢీ–13లో స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తున్న కావ్యశ్రీ 

మంచి కొరియోగ్రాఫర్‌ కావడమే లక్ష్యం
చిన్ననాటి నుంచి డ్యాన్స్‌ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్‌ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్‌లోకి ప్రవేశించి..   టైటిల్‌ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం.   
– కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్‌ విన్నర్‌

బిగ్‌బాస్‌ షోలో అదరగొట్టిన అరియానా
గతేడాది జరిగిన బిగ్‌బాస్‌– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్‌– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్‌ వరకు గట్టి పోటీ ఇచి్చంది.   తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్‌ కాగా శశికళ నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్‌ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది.


తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్‌) 

 అల్లు అర్జున్‌ చేతుల మీదుగా క్యాష్‌ ప్రైజ్‌ తీసుకుంటున్న కావ్యశ్రీ  

చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్‌ జింగ్‌ అమేజింగ్‌ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్‌ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్‌ ఫైవ్‌ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో వచ్చిన ప్రైజ్‌మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం.        

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top