
కేరళలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి అండగా కోలీవుడ్ హీరోలు నిలిచారు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి పలు గ్రామాలపై పడటంతో సుమారు 200 మంది మరణించారు. అయితే, 250 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అక్కడి ప్రభుత్వం తెలుపుతుంది. ముఖ్యంగా వయనాడ్, తిరువనంతపురం ప్రజలు తీరని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసిన నేలకూలిన భవనాలు, బురదతో నిండిన వీధులు మాత్రమే కనిపిస్తున్నాయి. కేరళలో ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే, తాజాగా కోలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరూ కేరళకు తమ వంతు అండగా నిలిచారు.

తమిళ స్టార్ చియాన్ విక్రమ్, కేరళలో సంభవించిన విపత్తుపై ఉదారంగా స్పందించినందుకు అభిమానుల నుంచి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో జరిగిన విషాద సంఘటనలను చూసి చలించిన విక్రమ్ సహాయక చర్యల కోసం తన వంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు అందించారు. కేరళ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఆయన చాటుకున్నాడు.

దేశంలో ఎక్కడ విపత్తు వచ్చిన సాయం చేయడంలో ముందు ఉండే దంపతులు సూర్య- జ్యోతిక. తాజాగా వీరిద్దరూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. సూర్య చేసిన సాయానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. కేరళలో ప్రస్థుత పరిస్థితిని చూస్తుంటే తనను ఎంతో కలచి వేసిందని సూర్య తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాధానికి గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు.