'బిగ్‌బాస్‌లో సపోర్ట్‌.. ఇప్పుడేమైంది? ప్లీజ్‌, నా సినిమాకు వెళ్లండి' | Sakshi
Sakshi News home page

Bootcut Balaraju: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్‌

Published Sat, Feb 3 2024 11:38 AM

Syed Sohel Ryan Gets Emotional Over Bootcut Balaraju Response - Sakshi

బిగ్‌బాస్‌ వల్ల వచ్చే ఫేమ్‌ శాశ్వతంగా ఉండదు. దాన్ని నిలబెట్టుకోవడం కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. విజేతలతో సహా చాలామంది కంటెస్టెంట్లు దాన్ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోహైల్‌ మాత్రం వరుసపెట్టి సినిమాలకు సంతకం చేశాడు. ఆ మధ్య మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ మూవీ చేయగా దీనికి పాజిటివ్‌ స్పందన వచ్చింది. సోహైల్‌ నటనకు మార్కులు పడటంతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి.

హీరో, నిర్మాతగా సోహైల్‌
తాజాగా అతడు నటించిన బూట్‌కట్‌ బాలరాజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సోహైల్‌ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించింది. సునీల్‌, ఇంద్రజ, ముక్కు అవినాష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస్‌ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్‌ అయింది. ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సోహైల్‌ కంటతడి పెట్టుకున్నాడు.

నేను కూడా అలాంటివి చేయను
అతడు మాట్లాడుతూ.. 'ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. ఇందులో కంటెంట్‌ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. రూ.5 కోట్లు పెట్టి తీసిన సినిమాకు నో షో బోర్డులు పెట్టడమేంటన్నా? జనాలు ఎక్కువగా లేరని షోలు క్యాన్సిల్‌ చేస్తున్నారు. ఒక థియేటర్‌కు కనీసం 30 మందైనా వెళ్లండన్నా.. ఫ్యామిలీ చూడగలిగే సినిమాలు తీయండన్నారు కదా మరి ఇప్పుడేమైందన్నా? నేను తీస్తే ఎందుకు ఆదరించడం లేదు? ప్రమోషన్స్‌ చేయడానికి మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. నా స్థోమతలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఒక్కటే చేయగలిగాను. 

అయినా ఫ్యామిలీ సినిమాలు చూడరు కదా.. నేను కూడా ఇకపై అలాంటివి చేయను. ముద్దు సన్నివేశాలుండేవే చేస్తాను. అరె.. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇది! క్యూట్‌ సినిమా తీశావని కొందరు మెచ్చుకుంటున్నారు. నిజంగానే బూట్‌కట్‌ బాలరాజు బానే ఉంది కదా.. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడూ స్నేహితులతోనే కాదు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడండి. నా సినిమాకు వెళ్లండన్నా.. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడు నాకు మద్దతుగా వేల కామెంట్లు పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నా?' అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు

ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌
పక్కనే ఉన్న అవినాష్‌ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన కొందరు.. బిగ్‌బాస్‌ గుర్తింపుతో సినిమాల్లో రాణించవచ్చనుకోవడం నీ పొరపాటని విమర్శిస్తున్నారు. నీ సినిమాలో దమ్ముంటే నువ్వు అడక్కపోయినా జనాలు వస్తారని కామెంట్లు చేస్తున్నారు. కంటెంట్‌ ఉండే చిత్రాలపై దృష్టి సారించమని సలహా ఇస్తున్నారు.

చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి..
 'దమ్‌ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్‌.. మిలియన్లకొద్ది వ్యూస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement