SV Ranga Rao Birth Anniversary: ‘ఆయన నన్ను పెంచిన నాన్న’

SV Ranga Rao 103rd Birth Anniversary Special Story In Telugu - Sakshi

ఎస్‌. వి. రంగారావు... నిండైన విగ్రహం... వెండితెర మీద కనపడగానే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు
ఒక్కసారి కళ్లు చిట్లించి, పెదవి విరిచి, తల కొద్దిగా ఆడిస్తే.. ప్రేక్షకులకు మైమరపే..
మాట పెదవి దాటకుండానే భావం ముఖంలో కనపడుతుంది..
ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు..
ఇంటి పెద్దన్నయ్య, మతిమరపు తండ్రి.. 
ఏ పాత్రయినా ఆయనలో జీవిస్తుంది.. ఆయనపై కోపం తెప్పిస్తుంది.
‘బానిసలకు ఇంత అహంభావమా’, ‘ఎవరూ సృష్టించనిదే మాటలు ఎలా పుడతాయి’ ‘సాహసం సాయరా రాజకుమారి దొరుకుతుంది’ ‘జై పాతాళభైరవీ’ ఈ మాటలు వేటికవే ప్రత్యేకం..
మాయా బజార్, పండంటి కాపురం, బాంధవ్యాలు, నర్తనశాల, సంపూర్ణ రామాయణం, భక్త ప్రహ్లాద.. ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మరచిపోయినట్లే. నటనే శ్వాసగా జీవించి, నటిస్తూనే తుదిశ్వాస విడిచారు.ఆయన మేనల్లుడు, ఆయన దగ్గరే పెరిగిన ఉదయ్‌ కుమార్‌ బడేటి.. ఎస్‌. వి. రంగారావు మావయ్య గురించి సాక్షికి వివరించారు. 

SV Ranga Rao Birth Anniversary: మా మావయ్య కృష్ణా జిల్లా నూజివీడులో జూలై 3, 1918లో జన్మించారు. తండ్రి సామర్ల కోటేశ్వరరావు ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్, తల్లి లక్ష్మీ నరసాయమ్మ. మావయ్య వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఏడుగురు అక్కచెల్లెళ్లు. మావయ్య వాళ్ల తాతగారు కోటయ్యనాయుడు పేరున్న డాక్టరు. మావయ్యకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి విజయలక్ష్మి, అల్లుడు (మేనల్లుడు) సూర్యవరప్రసాద్‌ శృంగారం, డల్లాస్‌లో ఉంటున్నారు. రెండో అమ్మాయి ప్రమీలారాణి, అల్లుడు సత్యనారాయణ కడిం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అబ్బాయి పేరు కోటేశ్వరరావు కాలం చేశాడు. నేను మావయ్య ఆరవ చెల్లెలి కొడుకును. అమ్మ పేరు శకుంతల. 

బెత్తంతో దెబ్బలు..
మావయ్య వాళ్లని మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో, మావయ్య వాళ్ల నాయనమ్మ.. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లతో చెన్నై ట్రిప్లికేన్‌లో ఇల్లు తీసుకుని, హిందూ హైస్కూల్‌లో మావయ్యను పదో తరగతి వరకు చదివించారట. ఆ తరవాత వైజాగ్‌లో ఇంటర్, కాకినాడ పీఆర్‌ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నారు. అక్కడే యంగ్‌ మెన్స్‌ క్లబ్‌లో నాటకాలు వేసేవారట. మావయ్యకు చదువు మీద కంటే, సినిమాలంటేనే ఇష్టం. ప్రతిరోజూ సెకండ్‌ షోకి వెళ్లేవారట. ఇందుకోసం తమ్ముడితో కలిసి ముందు గదిలో పడుకుని, తమ్ముడి కాలి వేలికి ఒక దారం కట్టి, సినిమా నుంచి రాగానే తమ్ముడి కాలి దారాన్ని లాగ్గానే, తలుపు తీస్తే, వచ్చి పడుకునే వారట మావయ్య. ఒకరోజు కరెంటు పోయిన సమయంలో, మావయ్యను నిద్ర లేపడానికి వాళ్ల నాయనమ్మ వచ్చేసరికి అక్కడ మావయ్య స్థానంలో తలగడలు ఉన్నాయిట. అప్పుడు ఆవిడ తాడును పట్టుకుని మావయ్య వచ్చేవరకు కూర్చుని, రాగానే బెత్తంతో నాలుగు దెబ్బలు వేసిందట.

ఉదయ్‌ కుమార్‌ బడేటి

అదే మొదటి శుభకార్యం... 
మావయ్య వివాహం 1947 డిసెంబరు 27న ఏలూరులో జరిగింది. మావయ్యది మేనరికం. అత్త పేరు లీలావతి. మావయ్య షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. ఇంటికి వచ్చినవారందరికీ అత్తయ్య వంట చేసేది. మావయ్య 1958 ఏప్రిల్‌ 30న చెన్నై హబీబుల్లా రోడ్డులో సొంత ఇంటి గృహప్రవేశం చేశారు. మావయ్య పెద్ద కూతురు విజయలక్ష్మి వివాహం మావయ్య వాళ్ల అక్క రాజవల్లి కుమారుడితో జరిగింది. రెండు నెలల పాటు ఇల్లంతా బంధువులతో నిండిపోయింది.  

వేసవి సెలవులు
మావయ్య వేసవిలో షూటింగ్‌లు లేకుండా ఖాళీ ఉంచుకుని, మా అత్తమ్మ పుట్టిల్లు ఏలూరు వెళ్లేవారు. కాకినాడలో మావయ్య స్నేహితులను కలిసేవారు. నెల్లూరు మైపాడ్‌ దగ్గర ‘బాంధవ్యాలు’ సినిమా షూటింగ్‌కి నన్ను అత్తయ్యను తీసుకువెళ్లి, అక్కడ మా కోసం బోట్‌ హౌస్‌ ఏర్పాటు చేయించారు. షూటింగ్‌ ఉన్నన్ని రోజులూ అందులోనే ఉన్నాం. అప్పుడప్పుడు మహాబలిపురం దారిలో ఉన్న తోటకు తీసుకువెళ్లేవారు. అక్కడ సరదాగా ఏదో ఒక వంటకం చేసేవారు. కోవళం బీచ్‌ నుంచి తాజా సముద్రపు చేపలను తీసుకువచ్చేవారు. ఆయనకు భోజనంలోకి నాలుగైదు రకాలు ఉండాలి. అందులో స్వీట్‌ తప్పనిసరి. మటన్‌ బాగా ఇష్టం. మావయ్యకు ఇష్టమైన వంటకాలను అత్తయ్య వండి పెట్టేది. ప్రతి దీపావళికి బ్యాంక్‌ నుంచి కొత్త నోట్లు తెచ్చి స్డూడియో స్టాఫ్‌కి ఇచ్చేవారు. మా అందరికీ కొత్త బట్టలు, ఎన్ని రోజులు కాల్చినా తరగనన్ని టపాసులు తెచ్చేవారు. దసరా పండుగకు బొమ్మల కొలువుతో సందడిగా ఉండేది.  

మల్టీ టాలెంటెడ్‌..
మావయ్య ఆల్‌రౌండర్‌. హంటింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇంట్లో డబుల్‌ బ్యారెల్‌ గన్, రైఫిల్, రివాల్వర్‌ ఉండేవి. ఖాళీ దొరికితే బొమ్మలు వేసేవారు. కవిత్వం రాసేవారు. బాగా మూడ్‌ వస్తే ఎస్‌. రాజేశ్వరరావు సోదరులు ఎస్‌ హనుమంతరావును పిలిపించి, సరదాగా ట్యూన్స్‌ చెప్పేవారు. పుస్తకాలు ముఖ్యంగా షేక్‌స్పియర్‌ పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఆయన అప్పట్లో ‘యువ’లో రాసిన కథలను సేకరించి తిరుపతి ‘కథాప్రపంచం’ వారు పుస్తకం ప్రచురించారు. 

ప్రకృతి ప్రేమికులు..
ఇంట్లో కుక్కలు, పావురాలు, ఆక్వేరియం ఉండేవి. 24వేల చదరపు అడుగుల స్థలంలో పూల మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లు పెంచారు. మామిడి చెట్లకు కాసిన పెద్ద పెద్ద కాయలను అందరికీ పంచేవారు. ఆయనకు నూజివీడు రసాలు, బంగినపల్లి చాలా ఇష్టం. వాచీలు, సిగరెట్‌ లైటర్లు సేకరించేవారు. ఇంట్లో ఉన్న 16 ఎంఎం ప్రొజెక్టర్‌ కెమెరాలో సినిమాలు వేసి చూపించే వారు. ప్రివ్యూ చూశాక, సినిమా ఎలా ఉందని అడిగేవారు. 

మావయ్య ఈజ్‌ స్పెషల్‌...
తిరుపతి వచ్చిన వారంతా టూరిస్టు బస్సులలో మావయ్యను చూడటానికి చెన్నై వచ్చేవారట. గేటు తీయగానే పరుగుపరుగున లోపలకు వచ్చి, సంతకాలు తీసుకుంటూ, దేవుడిని చూసినట్లు చూసేవారట. మావయ్య చూడటానికి భారీ విగ్రహంలా ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా ఉండేవారు. మా కోసం క్రికెట్‌ వీఐపీ పాస్‌లు తెప్పించేవారు. ఆయనకు ఖాళీ ఉంటే వెళ్లేవారు. లేదంటే రేడియోలో కామెంటరీ వినేవారు. పిల్లల సినిమాలకు ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలకు మావయ్య స్వయంగా తీసుకువెళ్లేవారు. మావయ్య అమెరికా వెళ్తున్నప్పుడు అందరినీ తన వెంట తీసుకువెళ్లి, అమెరికా అంతా చూపించారు. ఆయన పోయేవరకు రైలు అంటే తెలియదు. మావయ్యకు నాలుగు కార్లు ఉండేవి. విమానంలోనో, కారులోనో తిప్పేవారు. అంత అపురూపంగా చేసేవారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నాం. మావయ్య మరణం మాకు చీకటి  మిగిల్చింది. నా 13 సంవత్సరాల జీవితం మావయ్య దగ్గరే గడిచింది. మావయ్య మనవల్ని (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) పెంచాను, ఇప్పుడు వాళ్లే నన్ను చూస్తున్నారు.

మావయ్య నాకు దైవం..
నా కంటే పైన ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు రామారావు. నేను పుట్టిన ఐదు నెలలకు అన్నయ్యకు బాగా అనారోగ్యం చేసింది. రెండు సంవత్సరాల పాటు అమ్మ అన్నయ్యను చూసుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నన్ను అత్తయ్య మావయ్య చేరదీశారు. నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన పోయేవరకు ఆయనకు సన్నిహితంగా ఉన్నాను. నన్ను మద్రాసు చర్చ్‌పార్క్‌ స్కూల్‌లో చేర్పించారు. అప్పుడప్పుడు దింపేవారు. ఆ దింపటంలో ఒక గమ్మత్తు జరిగేది. ఏదో ఆలోచించుకుంటూ స్కూల్‌ దగ్గర దింపటం మరచిపోయి షూటింగ్‌కి తీసుకు వెళ్లిపోయి, ‘అయ్యో మర్చిపోయానే’ అని మళ్లీ షూటింగ్‌ పూర్తయ్యాక ఇంటికి తీసుకువచ్చేసేవారు. ఎప్పుడైనా సినిమాల పని మీద హైదరాబాద్‌ వెళ్లవలసి వస్తే, నన్ను మా అమ్మ దగ్గర వదిలేసి, మళ్లీ వెనక్కు వెళ్లేటప్పుడు తీసుకువెళ్లేవారు. స్కూల్‌లో చేరాక కుదరలేదు. అందరితోనూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎవరితో మనస్ఫర్థలు వచ్చినా సర్దుకుపోయేవారు. పిల్లలు ‘ఇది కావాలి’, ‘ఇది కొనుక్కుంటే బావుంటుంది’ అనుకునేలోపే వస్తువులు ఇంటికి వచ్చేసేవి. బ్రేక్‌ఫాస్ట్‌కి ఉడ్‌లాండ్స్‌ హోటల్‌కి తీసుకువెళ్లేవారు. నేను చిన్నపిల్లవాడిని కావటం వల్ల ఒంటి నిండా పోసుకునేవాడిని. అందుకని టిఫిన్‌ కారు దగ్గరకు తీసుకు వచ్చి, డాష్‌ బోర్డుకి హుక్‌ పెట్టి, దాని మీద ప్లేట్‌ పెట్టి తినిపించేవారు. అప్పుడప్పుడు బీచ్‌కి తీసుకు వెళ్లేవారు. బుహారీ హోటల్‌లో చికెన్‌ 65, ఐస్‌క్రీమ్, చైనీస్‌ హోటల్‌లో ప్రాన్‌ పకోడా పెట్టించేవారు. – ఉదయ్‌కుమార్‌ బడేటి (ఎస్‌.వి. రంగారావు మేనల్లుడు) 
సంభాషణ: వైజయంతి పురాణపండ

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top