ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్‌ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి | Sakshi
Sakshi News home page

రాజేంద్ర ప్రసాద్‌ ఇబ్బంది పెడితే బాబుమోహన్‌తో హిట్‌ కొట్టాను: ఎస్వీ కృష్ణారెడ్ఢి

Published Mon, Feb 5 2024 10:30 AM

SV Krishna Reddy Comments On RajendraPrasad - Sakshi

ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్‌ హిట్‌.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్‌ చిత్రాలు వెండితెరపై మెరిశాయి.

ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా
'మాయలోడు'  సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ అయింది. ఆ పాట‌లో బాబూమోహ‌న్- సౌంద‌ర్య‌ కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. సుమారు 30 ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్‌ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్‌ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఆ సినిమాలో  హీరో రాజేంద్ర ప్రసాద్‌.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్‌ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయ‌లోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్ర‌ప్ర‌సాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాట‌ను  బాబూ మోహ‌న్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు.

'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్‌ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావ‌ట క‌దా.. నువ్వూ స్టెప్పులు వేస్తావ‌ట క‌దా..' అంటూ నాపట్ల రాజేంద్ర‌ప్ర‌సాద్ వెట‌కారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్‌ డేట్స్‌ తక్కవ కావడంతో అదనపు డేట్స్‌ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.

ఎలా చేస్తావో చూస్తా అన్నారు
ఫైనల్‌గా రాజేంద్ర ప్ర‌సాద్‌తో మిగిలిన డేట్స్ తో  డ‌బ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్‌ పత్రాలను తన మేనేజర్‌ చూసిన తర్వాతే డబ్బింగ్‌ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డ‌బ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుంద‌ని ఆయ‌న అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్‌ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్‌ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్‌ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్‌ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతటితో రాజేంద్ర‌ప్రసాద్ నిష్క్ర‌మించ‌గా.. ఇక ఆయన్ను బ‌తిమాలాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహ‌న్‌తో సాంగ్‌ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహ‌న్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్‌, సౌందర్యతో పాట‌ తీస్తున్న విష‌యాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్‌  ఆ తర్వాత కొందరి మ‌ధ్య‌వ‌ర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్‌ తీసేందుకు రాజేంద్రప్రసాద్‌ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవ‌స‌రం లేద‌ని, ఇప్పటికే బాబూమోహ‌న్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్ర‌ప్ర‌సాద్ షూటింగ్‌ స్పాట్‌ వద్దకు రావొచ్చ‌ని,  చూసి వెళ్లొచ్చ‌ని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు.

చిత్రపరిశ్రమలో తాను ద‌ర్శ‌కుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్ర‌సాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్‌  స‌హ‌కారం ఎంతో ఉంద‌ని కూడా ఇదే సంద‌ర్భంలో అన్నారు. కానీ మాయ‌లోడు సినిమా విష‌యంలో మాత్రం త‌నను రాజేంద్ర‌ప్ర‌సాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ  కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement