గురుభక్తిలో బాలు

SP Balasubramanyam first song introduced by his relative SP Kodandapani - Sakshi

గురువును ఎవరైనా ఒకసారి రెండుసార్లు తలుచుకుంటారు. కాని బాలసుబ్రహ్మణ్యం మాత్రం తన గురువు ఎస్‌.పి. కోదండపాణిని జీవితాంతం గుర్తు చేసుకుంటూనే వచ్చారు. మద్రాసులో మద్రాసు సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ నిర్వహించిన పాటల పోటీకి నాటి మహామహులు ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి జడ్జీలుగా వచ్చారు. బాలు పాడిన పాటకే ఫస్ట్‌ ప్రైజ్‌ ఇచ్చారు. కాని పోటీ అయిపోయాక ఒక వ్యక్తి తనను పరిచయం చేసుకుని తాను సంగీత దర్శకుడు కోదండపాణి అని చెప్పారు. ‘నీ గొంతు బాగుంది. నువ్వు డిసిప్లిన్‌తో ఉంటే నలభై ఏళ్లు ఇండస్ట్రీలో పాడతావు’ అని ఆశీర్వదించారు.

ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కాని ఆ మాటే నిజమైంది. కోదండపాణి బాలూను మెచ్చుకొని ఊరుకోలేదు. తన వెంట ఉంచుకున్నారు. పాటల మెలకువలు నేర్పారు. చాలామంది సంగీత దర్శకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. తొలి పాటకు అవకాశం ఇచ్చారు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన ‘మేడంటే మేడా కాదు’ పాట బాలూకు మంచి గుర్తింపు తెచ్చింది. అందుకే ఎస్‌.పి.కోదండపాణి పేరు తన రికార్డింగ్‌ థియేటర్‌కు పెట్టుకున్నారు బాలు. అంతేకాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా ఎస్‌.పి.కోదండపాణి ఫిల్మ్‌ సర్క్యూట్‌గా ఉంచారు. ‘నా విజయాన్ని మా గురువుగారు చూసి ఉంటే బాగుండేది’ అని చెప్పుకునేవారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top