విశ్వదేవ్ రాచకొండ, శోభిత ధూళిపాళ్ల, శరణ్ కొప్పిశెట్టి
‘‘చీకటిలో’ సినిమాలో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా చేశాను. ఈ కథ నా చుట్టూ తిరుగుతుంటుంది. హైదరాబాద్‌లో జరిగే కొన్ని చీకటి రహస్యాలను ధైర్యంగా వెలికి తీసే పాత్ర నాది. సంధ్య ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? అన్నది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. నా మనసుకు బాగా నచ్చిన పాత్ర సంధ్య’’ అని శోభిత ధూళి పాళ్ల తెలి పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీకటిలో...’. చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శోభిత ధూళి పాళ్ల మాట్లాడుతూ– ‘‘అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతంలో ‘మేడిన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్ చేశాను. ‘చీకటిలో’ కథ వారి దగ్గరకి వచ్చినప్పుడు సంధ్య పాత్ర కోసం నన్ను అనుకున్నారు. శరణ్‌గారు చెప్పిన ‘చీకటిలో’ కథ నచ్చింది.
సంధ్య క్యారెక్టర్ గురించి వినగానే... ఓ నటిగా ఇలాంటి పాత్ర చేయాలని అనిపించింది. పాడ్ కాస్ట్ కల్చర్ మన దేశంలో ఇప్పుడిప్పుడే వస్తోంది. మా మూవీలో చూపించిన క్రైమ్ పాడ్ కాస్ట్ ఆడియన్స్‌కి కొత్తగా అనిపిస్తుందనే నమ్మకం ఉంది. ఇక నేను వేగంగా సినిమాలు చేయాలనుకోవడం లేదు. కథలు చాలా వింటున్నప్పటికీ నాకు బాగా నచ్చితేనే నటిస్తున్నాను. నేను వేరే భాషల్లో నటిస్తున్నప్పటికీ నా మాతృభాష తెలుగులో నటించడం సౌకర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళ్‌లో ‘వెట్టువమ్’ అనే సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.
శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ– ‘‘సంధ్య పాత్ర కోసం శోభిత వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ఈ మూవీ ద్వారా జనాల్లో అవగాహన తీసుకురావడంతో పాటు ఓ సందేశం కూడా ఇస్తున్నాం. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ‘అధీరా’కి నేను దర్శకత్వం వహించబోతున్నాను’’ అని పేర్కొన్నారు. విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ– ‘‘చీకటిలో’ కథ వినగానే క్రైమ్ జానర్‌లోకి అడుగుపెడుతున్న ఒక రియలిస్టిక్ డ్రామాలా అనిపించింది’’ అన్నారు.


