‘సార్‌’ మూవీ రివ్యూ

Sir Bollywood Movie Review - Sakshi

సినిమా : సార్‌
నటీనటులు : తిలోత్తమా శోమె, వివేక్‌ గోంబర్‌ 
దర్శకత్వం : రొహెనా గెర
నిర్మాతలు : రొహెనా గెర, బ్రిస్‌ పోసన్‌
సంగీతం : పిర్రె ఏవియట్‌

కథ : న్యూయార్క్‌లో ఉద్యోగం చేసుకుంటున్న అశ్విన్‌( వివేక్‌ గోంబర్‌) సోదరుడి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ముంబై వస్తాడు. అతడు చనిపోవటంతో కుటుంబానికి అండగా ఉండటానికి ముంబైలోనే ఉండిపోతాడు. ప్రియురాలితో కలిసి అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌ ఉంటాడు. రత్న(తిలోత్తమ శోమె) వారింట్లో పని మనిషిగా చేరుతుంది. కొద్ది కాలానికి అశ్విన్‌కు అతడి ప్రియురాలికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఇద్దరూ విడిపోతారు. మానసికంగా కుంగుబాటులో ఉన్న అతడి మనసుకు రత్న ద్వారా సాంత్వన లభిస్తుంది. ఆమె చేష్టలు, తన పట్ల కేరింగ్‌ అశ్విన్‌ను ఎంతోగానో ఆకట్టుకుంటాయి.

ఆమె పని మనిషి అన్న ఆలోచన లేకుండా ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెబుతాడు. తమ మధ్య ఉండాల్సింది యజమాని, పని మనిషి బంధమేనని ఇంకేమీ ఉండొద్దని ఆమె తేల్చి చెబుతుంది. తమ ప్రేమను సమాజం హర్షించదని హితవు పలుకుతుంది. అయినా పట్టు వదలకుండా ఆమె ప్రేమకోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు అశ్విన్‌. అయితే చివరకు అశ్విన్‌.. రత్న ప్రేమను గెలుచుకోగలిగాడా? పని మనిషి సంకెళ్లను తెంపుకుని ఆమె అతడితో ఒక్కటవుతుందా? లేదా? అన్నదే మిగితా కథ.


సినిమా ఎలా ఉందంటే 

లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలయిన మొదటి సినిమా ఇది. 2020, మార్చి నెలలో సినిమాను విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. 2018లోనే ఈ సినిమా అమెరికాలో విడుదలై మంచి ఫలితాలను రాబట్టింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడింది. బోల్డ్‌ స్టోరీ లైన్‌తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కథ కొత్తదేమీ కాకపోయినప్పటికి ఇతర బాలీవుడ్‌ ప్రేమకథా చిత్రాల్లాగా కాకుండా విభిన్నంగా తీశాడు. రెండు భిన్న ధ్రువాల మధ్య ప్రేమ చిగురించటానికి యజమాని, పని మనిషికి బంధం అడ్డుకాదని చెప్పే కథాంశం.

మన ప్రతీ చర్య ఎదుటి వ్యక్తిపై ఎంతలా ప్రభావం చూపుతుందో రత్న పాత్ర మనకు తెలియజేస్తుంది. ఇద్దరి మధ్యా చోటు చేసుకునే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.  మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్న పదానికి సరికొత్త అర్థానిచ్చే ప్రేమ జంటగా నిలుస్తారు అశ్విన్‌, రత్న. ఓ వ్యక్తిని ప్రేమించటం అంటే వారి కలల్ని గౌరవించటం కూడా అని చెప్పే సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లవ్‌ స్టోరీ.

Rating:  
(3.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top