16 నామినేషన్స్‌తో సరికొత్త రికార్డు
ఆస్కార్ అవార్డుల చరిత్రలో ‘సిన్నర్స్’ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అమెరికన్ పీరియాడికల్ హారర్ సినిమా 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఏకంగా 16 నామినేషన్స్ దక్కించుకుని, ఆస్కార్ నామినేషన్స్‌లో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నటులు డానియల్ బ్రూక్స్, లూయిస్ ఫుల్‌మన్ నామినేషన్లను ప్రకటించారు.
పలు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, నటుడు, సపోర్టింగ్ యాక్ట్రస్, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే వంటి విభాగాలు) నామినేషన్స్ దక్కించుకుని, ‘సిన్నర్స్’ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. గతంలో ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997), ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రాలు 14 నామినేషన్స్‌ను దక్కించుకున్న రికార్డును తాజాగా ‘సిన్నర్స్’ చిత్రం అధిగమించింది. ఇక ‘సిన్నర్స్’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి 13 నామినేషన్స్ దక్కాయి. ‘ఫ్రాకింగ్‌స్టన్’, ‘మార్టీ సుప్రీం’, ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్‌ను దక్కించుకోగా, ‘హ్యామ్‌నెట్’ సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి. అలాగే ఈ ఏడాది కొత్తగా ‘క్యాస్టింగ్ డైరెక్టర్’ విభాగాన్ని ప్రవేశపెట్టి, ఈ విభాగంలో నామినేషన్స్‌ను ప్రకటించారు.
⇒ ఉత్తమ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ‘సిన్నర్స్, ఎఫ్1, ది సీక్రెట్ ఏజెంట్, బగోనియా, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’... ఇలా పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. దర్శకత్వం విభాగంలో రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), క్లోయి జావ్ (హ్యామ్‌నెట్), జాష్ షాఫ్డీ (మార్టీ సుప్రీం),పాల్ థామస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ), యాక్టర్స్ విభాగంలో తిమోతి చాలమేట్, లియోనార్డో డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరాలు, యాక్ట్రస్ విభాగంలో ‘ఎమ్మా స్టోన్, కేట్ హడ్సన్, రోజ్ బర్న్, జస్సీ బక్లీ, రెనాటా’ పోటీ పడుతున్నారు.
⇒ యాక్టింగ్ విభాగంలో అతి పిన్న వయసు (30 ఏళ్లు)లో మూడు నామినేషన్స్ దక్కించుకున్న వ్యక్తిగా తిమోతి చాలమేట్ నిలిచారు. ∙బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ‘సిన్నర్స్’కుగాను రూత్ ఈ. కార్టర్ నామినేషన్ దక్కించుకున్నారు. ఇది ఆమెకు ఐదో నామినేషన్. ఆస్కార్ చరిత్రలో ఐదు నామినేషన్స్ దక్కించుకున్న బ్లాక్ ఉమన్‌గా కార్టర్ నిలిచారు. ∙ఇదే సినిమాలోని నటనకు గాను 73 ఏళ్ల డెల్రోయ్ లిండోకి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఇది డెల్రోయ్‌కి తొలి ఆస్కార్ నామినేషన్ కావడం విశేషం. ∙యాక్టింగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ (‘ది సీక్రెట్ ఏజెంట్’ సినిమా) దక్కించుకున్న తొలి బ్రెజిలియన్ నటుడిగా వాగ్నర్ మౌరా రికార్డు సాధించారు.
⇒ వార్నర్ బ్రదర్స్ స్టూడియో సంస్థ నిర్మాణంలోని సినిమాలకు 30 ఆస్కార్ నామినేషన్స్ దక్కడం విశేషం. భారతీయ సినిమాకి నిరాశ: ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’ను ఇండియా తరఫున పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ∙ఆస్కార్ కన్సిడరేషన్ కోసం ఓటింగ్ పోటీలో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కాంతార: చాప్టర్1, మహావతార్ నరసింహా, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్‌నైట్’ చిత్రాలకూ నామినేషన్ దక్కకపోవడం నిరాశపరిచే విషయం.


