వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు నిర్మాత వంశీ నందిపాటి. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘హే బల్‌వంత్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి ‘ఇంకా ఎం అనుకోలేదు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ అనౌన్స్‌మెంట్ వీడియోపై, టైటిల్‌పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణ ప్రమోషన్ విధానాన్ని కాకుండా, వినూత్నంగా మీమ్స్‌తో నిండిన సరదా వీడియో ద్వారా టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో వ్యంగ్యంతో పాటు పాత ఈటీవీ థీమ్‌ను గుర్తుచేసే అంశాలు, హాస్యభరితమైన శైలి కనిపించాయి.
వీడియోలో వివిధ మీమ్ రిఫరెన్స్‌లు, చమత్కారమైన పంచ్‌లు వినోదాన్ని పెంచాయి. ఇంటర్నెట్ స్టైల్ కామెడీతో రూపొందిన ఈ క్లిప్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే ఈ ప్రకటనలో నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించకుండా ఉంచడం ఆసక్తిని మరింత పెంచింది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రానికి రమణా రెడ్డి, సమీర్ కన్ను సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.


