కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్‌ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
ఈ సిరీస్‌పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్‌తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.
అజయ్ అహుజా ఎవరంటే..
స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్‌ను గుర్తించే మిషన్‌లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.


