'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ | Sakshi
Sakshi News home page

Sapta Sagaralu Dhaati - Side B Review In Telugu: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' రివ్యూ

Published Fri, Nov 17 2023 12:49 PM

Sapta Sagaralu Dhaati Side B Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్: సప్త సాగరాలు దాటి సైడ్-బి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్ తదితరులు
నిర్మాత: పరంవహ పిక్చర్స్ (రక్షిత్ శెట్టి)
సమర్పణ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 
డైరెక్టర్: హేమంత్ ఎమ్ రావు
సంగీతం: చరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి 
విడుదల తేదీ: నవంబర్ 17, 2023

ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఏ భాష మూవీని అయినా సరే ఆదరిస్తారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా ' సప్త సాగరలు దాటి'. సెప్టెంబర్ లో 'సైడ్- ఏ' పేరుతో తొలి భాగం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని సీక్వెల్‌ను 'సప్త సాగరాలు దాటి సైడ్ - బి' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

కథేంటి?
డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ.

ఎలా ఉంది? 
'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చేస్తుంది. లేకపోతే ఇదేం బోరింగ్ సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్.. జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ కాగా.. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివేంజ్ డ్రామాతో సాగే ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను, 10 ఏళ్ల తర్వాత బయటకు రావడంతో సినిమా మొదలవుతుంది. తనకు జైల్లో పరిచయమైన ఓ వ్యక్తి మనుకి ఆశ్రయం ఇస్తాడు. అప్పటికే తన లవర్ ప్రియకి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోవడంతో మను ఆమెని కలవడానికి కూడా ఇష్టపడడు. కానీ ఆమెని మర్చిపోలేడు.

దీంతో దూరం నుంచి ఆమెని గమనిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటాయి. అలా ఇంటర్వల్ కార్డ్ పడతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ షురూ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ని చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెడ్తాడు. మరి చివరకు మను - ప్రియ ఒక్కటయ్యారా? లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.

సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సప్త సాగారాలు దాటి ఫస్ట్ పార్ట్.. కథ, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పార్ట్ మాత్రం చాలా స్లోగా ఉండి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఎక్కడా ఇంట్రెస్ట్ అనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంప్రెసివ్ గా ఏం లేదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేస్తుంది.

అయితే సినిమాలో చిన్న చిన్న డీటైలింగ్ మాత్రం బాగుంది. తనకి డబ్బులు అవసరమై, ఇంతకుముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరకు మను వెళతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. మళ్ళీ వెళ్తే మనుని కుక్కలా ట్రీట్ చేసి, బిస్కెట్ వేసినట్టు ఖరీదైన వాచ్ పడేస్తారు. దీంతో మనుకి కోపం వచ్చి, తనని కుక్కలా ట్రీట్ చేసిన ఓనర్ కొడుకుని కుక్కతో కరిపిస్తాడు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన ప్రభుని ఓ పాడుబడ్డ గోడౌన్ లో బంధించి, తను జైలులో అనుభవించిన దానిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

అలానే ఫస్ట్ పార్ట్‌లో ఉన్న విలన్ రెండో భాగంలోనూ ఉంటాడు. సినిమా సముద్రం హోరుతో మొదలై అదే సముద్రం హోరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే.. ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపిస్తారు. ఓవరాల్ గా చెప్పుకుంటే 'సప్త సాగరాలు దాటి సైడ్- బీ'.. ఫస్ట్ పార్ట్ అంత అయితే కనెక్ట్ కాదు. సాగదీత ఎక్కువైంది.

ఎవరెలా చేశారు?
హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలానే పాత్రలో జీవించాడు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్.. ఇందులో గృహిణిగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. ఇదే సినిమాలో వేశ్యగా, హీరోకి ప్రియురాలు సురభిగా చేసిన చైత్ర జే ఆచర్ కి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై ఎడిటర్ దృష్టి పెట్టుంటే బాగుండేేది. రెండున్నర గంటల సినిమా ఇది. ఓ అరగంట తగ్గించొచ్చు. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. 
- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

Rating:
Advertisement
 
Advertisement