ప్రభాస్‌ తల్లిగా పిలుస్తుంటే ఆనందంగా ఉంది | Salaar Actress Easwari Rao Talks About Her Role as Prabhas’ Mother | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ తల్లిగా పిలుస్తుంటే ఆనందంగా ఉంది

Aug 17 2026 8:59 AM | Updated on Aug 17 2026 9:02 AM

Salaar Actress Easwari Rao Talks About Her Role as Prabhas’ Mother

గతంలో ‘ఇంటింటా దీపావళి’, ‘రాంబంటు’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రముఖ నటి ఈశ్వరిరావు.. ప్రస్తుతం అగ్రతారలకు తల్లిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తొలిసారిగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆమెకు సిబ్బంది గౌరవ సంప్రదాయం ప్రకారం అంతరాలయ దర్శనం కల్పించారు.

అనంతరం ఈశ్వరిరావు మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం లభించిందన్నారు. ముఖ్యంగా ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘సలార్’, ‘దర్బార్’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నానని తెలిపారు.

హీరోయిన్‌గా నటించిన రోజులను గుర్తుచేసుకున్న ఈశ్వరిరావు.. ప్రస్తుతం అగ్రహీరోలకు తల్లిగా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నానని అన్నారు. ముఖ్యంగా ‘సలార్’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించిన తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. బయటకు వెళ్లినప్పుడు అభిమానులు తనను ‘సలార్‌లో ప్రభాస్ తల్లి’ అని గుర్తించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ, అభిమానం తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఈశ్వరిరావు పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ మంచి కథలు, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం ఎంతో ప్రశాంతమైన అనుభూతిని కలిగించిందని, స్వామివారి ఆశీస్సులతో మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement