Rohit Shetty Love Story: డిన్నర్‌ డేట్స్, రొమాంటిక్‌ ఈవెనింగ్స్‌.. కానీ

Rohit Shetty, Prachi Desai Breakup Love Story - Sakshi

 మొహబ్బతే

రోహిత్‌ శెట్టి.. మోడర్న్‌ బాలీవుడ్‌లో కమర్షియల్లీ ఎంటర్‌టైనింగ్‌ సినిమా ఫార్ములాను కనిపెట్టిన దర్శకుడు! హీరో వర్షిప్‌ను డైరెక్టర్‌ వర్షిప్‌గా బదలాయించిన వాడు.. టెక్నీషియన్స్‌ ఇమేజ్‌ను ఇనుమడింప చేసినవాడు! కెరీర్‌ గ్రాఫ్‌లో ఆకాశంతో పోటీపడ్తున్న ఈ ఫిల్మ్‌ మేకర్‌ ప్రేమ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్‌గానే ఉండిపోయాడు!

అతని ప్రేమిక పేరు ప్రాచీ దేశాయ్‌. ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’లో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్స్‌. ఈ ప్రేమ కథా సాదాసీదాగానే ప్రారంభమైంది. ఆ సంగతి చెప్పుకునే ముందు రోహిత్‌ శెట్టి పెళ్లి జీవితం గురించి తెలుసుకోవాలి. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పేరు మాయా. ఒక కొడుకు కూడా. ఇషాన్‌ శెట్టి. బాలీవుడ్‌లోని రోహిత్‌ శెట్టి పరిచయస్తుల ప్రకారం.. మరీ అన్యోన్య దాంపత్యం కాకపోయినా పొరపొచ్చాలతో సతమతమవుతున్న సంసారమేం కాదు. 

ప్రాచీతో ప్రేమలో పడ్డాడు రోహిత్‌. ‘బోల్‌ బచ్చన్‌’ సమయంలో. ఆ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌కు చెల్లెలుగా నటించింది ప్రాచీ దేశాయ్‌. నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా జెనీలియా డిసూజాను అనుకున్నారు. ఆమె సైన్‌ కూడా చేసింది. ఎందుకనో సినిమా మొదలయ్యే టైమ్‌కి జెనీలియా తప్పుకుంది. ప్రాచీ చేరింది. రోహిత్‌ ప్రేమ మొదలైంది. 

ఫిదాకాక తప్పలేదు
‘బోల్‌ బచ్చన్‌’ చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతోంది. సీన్స్‌ వివరిస్తున్నప్పుడు ప్రాచీని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది రోహిత్‌కు. వృత్తిపట్ల ఆమె నిబద్ధత.. పాపులారిటీ మాయని పట్టించుకోని ఆమె స్థితప్రజ్ఞత అతనికి బాగా నచ్చాయి. ఆకర్షణకులోను చేసే అందమెలాగూ ఉండనే ఉంది. ప్రేమ పెంచుకోవడానికి ఈ కారణాలు చాలు కదా! ప్రాచీని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రత్యేకంగా ట్రీట్‌ చేయసాగాడు. షూటింగ్‌ ప్యాకప్‌ అవగానే డిన్నర్‌ డేట్స్, రొమాంటిక్‌ ఈవెనింగ్స్‌ను ఆస్వాదించసాగాడు ప్రాచీతో. రోహిత్‌కు పెళ్లయిన విషయం తెలిసున్న ఆమె తొలుత అతనితో ముభావంగానే ఉంది. కానీ హాస్య చతురతతో అతను ఇంప్రెస్‌ చేసిన తీరుకు ఫిదాకాక తప్పలేదు ఆమెకు. 

విడాకులకూ సిద్ధం 
ప్రాచీ ప్రాణమైపోయింది రోహిత్‌కు. సినిమా వర్క్‌ పూర్తయినా ఆమె చేయి వదల్లేదు. ఇంటికి వెళ్లడమే మానేశాడు. వాళ్లిద్దరూ సహజీవనం చేశారని చెప్తాయి బాలీవుడ్‌ వర్గాలు. వదంతులుగానూ ప్రచారం అయింది. అయితే ఆ విషయం మాయాకూ తెలిసింది రోహిత్‌ సన్నిహితుల ద్వారా. భార్యకు ప్రశ్నించే అవకాశమూ ఇవ్వలేదు.. ఎదురుగా వచ్చి తనూ వివరణ ఇవ్వలేదు. కుమిలిపోయింది మాయా. విడాకులకు సిద్ధమయ్యాడు రోహిత్‌. సంబంధించిన కాగితాలూ పంపాడు భార్యకు సంతకం చేయమని. ‘చస్తే చేయను’ అని భీష్మించుకుంది మాయా. ప్రాచీ ప్రేమను కలకాలం నిలుపుకోవడానికి మాయాతో తెగతెంపులు చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు. అయినా మాయా తగ్గలేదు. 

ఆమె వల్లే..
ప్రాచీ వల్ల బంగారం లాంటి కాపురం కూలిందనే కామెంట్లూ మొదలయ్యాయి. అవి ప్రాచీ చెవిన పడ్డాయి. కలత చెందింది. ‘నా వల్ల మీ ఇల్లు నాశనమవడం నాకిష్టం లేదు. ఏవేవో కామెంట్లు వింటున్నా. సారీ .. రోహిత్‌’ అని చెప్పింది ప్రాచీ. ‘అయ్యో.. మాకు ముందునుంచే కొన్ని ఇష్యూస్‌ ఉన్నాయి. నేను విడిగానే ఉండాలనుకున్నా.. లక్కీగా నా లైఫ్‌లోకి నువ్‌ వచ్చావ్‌’ అంటూ ఆమెను ఒప్పించజూశాడు. వినలేదు ప్రాచీ. ఇంటికి వెళ్లిపొమ్మని కోరింది. వెళ్లిపోయాడు. నేరుగా మాయా దగ్గరికే. మళ్లీ ప్రాచీ, అతను కలుసుకోలేదు. అలా ఆ ప్రేమ కథ ముగిసిపోయింది. భార్యా, కొడుకుతో సంతోషంగానే ఉన్నాడు రోహిత్‌. 

ఒంటరిగానే మిగిలిపోయింది ప్రాచీ. ఏ రిపోర్టర్‌ అయినా ‘పెళ్లి ఎప్పుడు?’ అని అతి చనువుగా అడిగితే ‘పెళ్లి గురించి నాకు గొప్ప అభిప్రాయమేం లేదు. అదొక భద్రమైన వ్యవస్థగా కూడా ఫీలవట్లేదు. అలాగని పెళ్లి చేసుకోననీ అనట్లేదు. చేసుకుంటాను నాకు నచ్చిన మనిషి తారసపడ్డప్పుడు’ అని చెబుతుంది ప్రాచీ దేశాయ్‌. 
‘ప్రాచీ వల్లే మీ పెళ్లి డిస్టర్బ్‌ అయిందా?’ అని మీడియా రోహిత్‌నూ ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు.. ‘లేదు. నా భార్యతో అంతకుముందు నుంచే నాకు చాలా ఇష్యూస్‌ ఉన్నాయి. వాటిని ఫేస్‌ చేశాను’ అని ప్రాచీకి చెప్పిన మాటనే మీడియాకూ చెప్పాడు రోహిత్‌.  
- ఎస్సార్‌

చదవండి: నా డిజిటల్‌ ఎంట్రీ గురించి భయంగా ఉంది: షాహిద్‌ కపూర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top