
భువనేశ్వర్ : ప్రముఖ ఒడిశా సంగీత దర్శకుడు శాంతను మోహపాత్రా(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన న్యుమోనియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత 60 ఏళ్లుగా సంగీత పరిశ్రమలో ఉన్న ఆయన ఎన్నో హిట్ సాంగ్స్‌కు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మొదటగా 'కోనార్క్ గాథా' అనే పాటతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన లతా మంగేష్కర్, మొహద్ రఫీ, మన్నా డే, ఉషా మంగేష్కర్ లాంటి అనేక మంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. (అత్యవసర సర్జరీ చేయించుకుంటున్న నటి)
'సంగీతంలో బతికే ఉంటారు'
1936లో మయూరభంజ్ జిల్లాలో జన్మించిన శాంతను మొదట ఒడిశా మైనింగ్ కార్పొరేషన్‌లో పనిచేశారు. శాంతను మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేశ్ లాల్, ఏపీ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. సంగీత దరర్శకుడిగా శాంతను చెరగని ముద్ర వేశారని, ఆయన భౌతికంగా దూరమైనా, సంగీతంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. శాంతను అంత్యక్రియలు నేడు ఒడిశాలో ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించనున్నారు. (ఆలియాభట్ స్టార్టప్.. పిల్లల దుస్తులు)