స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈయన లీడ్ రోల్ చేసిన 'డీసీ' ఈ నెల చివరలోనే రిలీజ్ రానుంది. జీ స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించి యంగ్ డైరెక్టర్లతో పలు చిత్రాల్ని తీస్తున్నాడు. ఈయన నిర్మిస్తున్న 'బెంజ్', 'ఫైట్ క్లబ్' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకుడు.
విశాల్ వెంకట్ ఇంతకు ముందు సిరి నేరంగలిల్ సిల మనిదర్గళ్, బాంబ్ వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన ఇప్పుడు మహిళా నేపథ్య కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రెజీనాని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో తమిళంలో అజిత్ 'విడాముయర్చి'లో రెజీనా విలన్‌గా చేసింది. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో నటించనుంది.
విశేషం ఏమిటంటే లోకేష్ కనకరాజ్ తొలి మూవీ 'మానగరం'లో రెజీనానే హీరోయినే. తాజాగా రూపొందనున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్నాడు.


