
ఇటలీ వీధుల్లో ప్రేమవిహారం చేస్తున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘కాక్‌టైల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని తెలిసింది. షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మికల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటలీ షూటింగ్ షెడ్యూల్‌లో టాకీ పార్టుతో పాటు సాంగ్స్‌ని కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ భోగట్టా. దినేష్ విజన్, లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ‘కాక్‌టైల్ 2’ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇక సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘కాక్‌టైల్ (2012)’కి సీక్వెల్‌గా ‘కాక్ టైల్ 2’ చిత్రం తెరకెక్కుతోంది.