తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న' | Sakshi
Sakshi News home page

'రష్మిక మందన్న' ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ తెలుసా..? పేదరికం నుంచి కోట్లలో సంపద

Published Fri, Apr 5 2024 1:42 PM

Rashmika Mandanna Birthday Special story - Sakshi

రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రష్మిక 'కిరిక్‌ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్‌ చిత్రాలతో నేషనల్‌ క్రష్‌గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్‌, డీప్‌ ఫేక్‌ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది.

రష్మిక విద్యాభ్యాసం వివరాలు
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్‌ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్‌ శెట్టి 'కిరిక్‌ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్‌ లేకుండానే ఛాన్స్‌ ఇచ్చాడు.

అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం
రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో  కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్‌లో ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్‌కి గిప్ట్‌గా ఇచ్చింది.

ఛలో టూ పుష్ప
కిరిక్‌ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్‌ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్‌ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక.

ఫస్ట్‌ రెమ్యునరేషన్‌
కిరిక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్‌. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్‌ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్‌ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్‌.

పేదరికం నుంచి కోట్లలో సంపద
చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే  సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్‌తో పాటు  ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది.  ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట.

23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె  సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట.

చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్‌ క్రష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement
Advertisement