
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.
దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు.
ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.